తమిళనాడును వీడని వాన.. అధికారులతో గవర్నర్ రవి భేటీ​

తమిళనాడును వీడని వాన.. అధికారులతో గవర్నర్ రవి భేటీ​

చెన్నై: దక్షిణ తమిళనాడు జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతున్నది. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ ​సరఫరా నిలిచిపోయింది. మొబైల్ ​కనెక్టివిటీ దెబ్బతిన్నది. రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. ఒక్క తిరునల్వేలి జిల్లాలోనే ఇప్పటివరకు కనీసం 36 గ్రామాలు ముంపునకు గురయ్యాయని అధికారులు తెలిపారు. 

కాగా  రాబోయే 24 గంటల్లోనూ వర్షాలు  కురుస్తాయని వాతావరణ కేంద్రం ఆరెంజ్​ అలర్ట్​ జారీ చేసింది. సహాయక చర్యల కోసం మరిన్ని హెలికాప్టర్లను పంపాలని కోరుతూ సీఎం స్టాలిన్ కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్‌‌కు లేఖ రాశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు తమిళనాడు గవర్నర్ ఆర్‌‌ఎన్ రవి కూడా కేంద్రబలగాలు, సెంట్రల్​ ఏజెన్సీలతో సమావేశమయ్యారు. 

కొనసాగుతున్న సహాయక చర్యలు

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు12,553 మందిని 143 సహాయ కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. మధురై నుంచి వచ్చిన ఎయిర్​ ఫోర్స్  హెలికాప్టర్లు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. వరదలో చిక్కుకున్న వారికి ఆహారం అందించాయి. తూత్తుకుడిలోని వాసవప్పపురం ప్రాంతంలో 118 మందిని సైన్యం రక్షించింది. వరదల్లో చిక్కుకున్న దాదాపు 100  మంది మహిళలు, పిల్లలను హెలికాప్టర్లతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల కోసం ఇండియన్ ​కోస్ట్​గార్డ్​ ఆరు డిజాస్టర్ రిలీఫ్ టీమ్‌‌లను దింపింది. 

శ్రీవైకుంఠం స్టేషన్‌‌లో ఎక్స్‌‌ప్రెస్ రైలులో చిక్కుకుపోయిన 800 మంది ప్రయాణికుల్లో సుమారు 300 మందిని సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు తరలించింది. మార్గంలో వంతెన పొంగిపొర్లడంతో మిగిలిన 500 మందిని తీసుకెళ్లడం సాధ్యంకాలేదు. రిలీఫ్ మెటీరియల్స్‌‌తో కూడిన హెలికాప్టర్ అక్కడికి బయలుదేరినా.. ప్రతికూల వాతావరణం వల్ల అక్కడ డ్రాప్ చేయలేకపోయింది. కాగా, తమిళనాడు సీఎం స్టాలిన్​ వరద సాయం కోసం ప్రధానితో మాట్లాడేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఓవైపు రాష్ట్రంలో జనం అల్లాడిపోతుంటే.. ఇండియా కూటమి సమావేశం కోసమే సీఎం స్టాలిన్​ ఢిల్లీ వెళ్లారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు.