బ్రిటన్‌‌‌‌ కేబినెట్‌‌‌‌లో ముగ్గురు మనోళ్లే

బ్రిటన్‌‌‌‌ కేబినెట్‌‌‌‌లో ముగ్గురు మనోళ్లే

లండన్‌‌‌‌:యూకే కొత్త ప్రభుత్వంలో ఇండియన్‌‌ సంతతికి చెందిన ముగ్గురికి ముఖ్యమైన మంత్రి పదవులు దక్కాయి. కన్జర్వేటివ్‌‌‌‌ పార్టీకి చెందిన బోరిస్‌‌‌‌ జాన్సన్‌‌‌‌ బ్రిటన్‌‌‌‌ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కేబినెట్‌‌‌‌ను ఏర్పాటు చేశారు. ముగ్గురు భారత సంతతికి చెందిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇన్ఫోసిస్‌‌‌‌ కో ఫౌండర్‌‌‌‌‌‌‌‌ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్‌, ఆగ్రాకు చెందిన అలోక్‌‌‌‌ శర్మ, గుజరాత్‌‌‌‌కు చెందిన ప్రీతి పటేల్‌‌‌‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రీతి పటేల్‌‌‌‌ను హోం మంత్రిగా నియమించారు. ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. యూకే కేబినెట్‌‌‌‌లో ఇండియాకు చెందిన ముగ్గురు ఉండటం ఇదే మొదటిసారి. వీళ్లతో పాటు పాకిస్తాన్‌‌‌‌ సంతతికి చెందిన జావేద్‌‌‌‌కు కూడా మంత్రివర్గంలో చోటు దక్కింది.  10 డౌనింగ్‌‌‌‌ స్ట్రీట్‌‌‌‌లో గురువారం కొత్త కేబినెట్‌‌‌‌ సమావేశమైంది. అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 31న యూరోపియన్‌‌‌‌ యూనియన్‌‌‌‌ నుంచి బ్రిటన్‌‌‌‌ బయటకు వెళ్తుందని బోరిస్‌‌‌‌ జాన్సన్‌‌‌‌ ప్రకటించారు. ప్రజాస్వామ్యంపై ఉన్న నమ్మకాన్ని పునరుద్ధరిస్తామని, ప్రజలకు ఇచ్చిన హామీలను  కచ్చితంగా నెరవేరుస్తామని జాన్సన్‌‌‌‌ హామీ ఇచ్చారు.

ప్రీతిపటేల్‌‌‌‌

గుజరాత్‌‌‌‌కు చెందిన 47 ఏళ్ల ప్రీతి పటేల్‌‌‌‌ ప్రధాని నరేంద్ర మోడీ సపోర్టర్‌‌‌‌‌‌‌‌. బ్రిటన్‌‌‌‌లో భారత సంతతికి చెందిన వారు ఏర్పాటు చేసే ప్రతి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మొదటిసారి 2010లో కన్జర్వేటివ్‌‌‌‌ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని థెరెసా మేను తీవ్రంగా విమర్శించేవారు. 2016లో ఈయూ నుంచి బ్రిటన్‌‌‌‌ బయటకు రావాలనే అంశాన్ని ప్రీతి ప్రచారం చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులు మంత్రిగా పనిచేశారు. ఫారిన్‌‌‌‌ అఫైర్స్‌‌‌‌ కమిటీ సభ్యురాలిగా ఉన్న పటేల్‌‌‌‌ బ్రిటన్‌‌‌‌ విధానాలను ముక్కుసూటిగా విమర్శించేవారు. బ్రిటన్‌‌‌‌ – ఇండియా మధ్య సంబంధాలు మెరుగుపడేందుకు కూడా ప్రయత్నించారు. బోరిస్‌‌‌‌ కేబినెట్‌‌‌‌లో పటేల్‌‌‌‌ హోం మంత్రిగా నియమితులయ్యారు. క్రైమ్‌‌‌‌కు వ్యతిరేకంగా పోరాడతానని, గతంలో పోస్ట్‌‌‌‌ బ్రెగ్జిట్‌‌‌‌కు సంబంధించిన వీసా గురించి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని ప్రీతి పటేల్‌‌‌‌ హామీ ఇచ్చారు.

రిషి సునక్‌

39 ఏళ్ల రిషి సునక్‌ ఇంగ్లండ్‌‌‌‌లోని హాంప్‌‌‌‌షైర్‌‌‌‌‌‌‌‌ కౌంటీలో పుట్టారు. ఆక్స్‌‌‌‌ఫర్డ్‌‌‌‌ యూనివర్సిటీలో డిగ్రి పూర్తి చేశారు. 2015 నుంచి యార్క్‌‌‌‌షైర్‌‌‌‌‌‌‌‌లోని రిచ్‌‌‌‌మాండ్‌‌‌‌కు ఎంపీగా ఉంటున్నారు. స్టాన్‌‌‌‌ఫోర్డ్‌‌‌‌ యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. ఇన్ఫోసిస్‌‌‌‌ కో ఫౌండర్‌‌‌‌‌‌‌‌ నారాయణమూర్తి కూతురు అక్షతా మూర్తిని పెళ్లి చేసుకున్నారు. రిషి  కేబినెట్‌‌‌‌లో ట్రెజరీ మంత్రిగా నియమితులయ్యారు. ఆ హోదాలోనే ఆయన కేబినెట్‌‌‌‌ సమావేశాలకు హాజరవుతారు.

అలోక్‌‌‌‌ శర్మ

ఉత్తరప్రదేశ్‌‌‌‌ ఆగ్రాలో పుట్టిన అలోక్‌‌‌‌శర్మ 2010 నుంచి రీడింగ్‌‌‌‌ వెస్ట్‌‌‌‌కు ఎంపీగా ఉంటున్నారు. ఈయన థెరెసా మే కేబినెట్‌‌‌‌లో కూడా మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత కేబినెట్‌‌‌‌లో ఇంటర్నేషనల్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌గా నియమితులయ్యారు. యూకే బడ్జెట్‌‌‌‌కు ఇంచార్జ్‌‌‌‌గా ఉంటారు. “ వాతావరణ మార్పులు, జబ్బులు, విపత్తులు లాంటి సవాళ్లను పరిష్కరించేందుకు యూకే ఎయిడ్‌‌‌‌ కృషి చేస్తుంది. పేదవాళ్ల జీవితాలను మార్చేందుకు కట్టుబడి ఉన్నాను. నాణ్యమైన విద్య, ఉద్యోగాలు ఇస్తా. బ్రిటన్‌‌‌‌ ఆర్థిక, సెక్యూరిటీ, విదేశీ ప్రయోజనాలను ప్రోత్సహిస్తాను” అని అలోక్‌‌‌‌ శర్మ అన్నారు.