కోటి రూపాయలు.. 3 కిలోల గోల్డ్​ సీజ్

కోటి రూపాయలు.. 3 కిలోల గోల్డ్​ సీజ్

ముషీరాబాద్/వికారాబాద్/కూకట్​పల్లి, వెలుగు: లోక్​సభ ఎన్నికల కోడ్​నేపథ్యంలో గ్రేటర్​సిటీతోపాటు శివారు జిల్లాల్లో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. శుక్రవారం వేర్వేరుచోట్ల భారీగా నగదు, బంగారం పట్టుబడింది. దోమలగూడ సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సౌత్ జోన్ టాస్క్​ఫోర్స్, దోమలగూడ పోలీసులు కలిసి శుక్రవారం సాయంత్రం ట్యాంక్ బండ్ పై తనిఖీలు చేపట్టారు. అదే టైంలో బైక్​పై అటుగా వచ్చిన కైలాస్ బిర్దార్, అమర్ బెల్ కోన్ ను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద ఉన్న బ్యాగులో 3 ప్లాస్టిక్ బాక్సులు ఉన్నాయి. వాటిలో 3 కేజీల392 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వాటి విలువ రూ.3 కోట్ల 22 లక్షల19 వేల 424 ఉంటుందని పోలీసులు తెలిపారు. 

ఆభరణాలకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకొని ఐటీ శాఖకు అప్పగించినట్లు సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అలాగే వికారాబాద్ జిల్లా నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రూ.కోటి 5లక్షలు పట్టుకున్నారు. మోమిన్​పేట సీఐ ఆంజనేయులు వివరాల ప్రకారం.. నవాబుపేట ఎస్సై భరత్ భూషణ్ సిబ్బందితో కలిసి శుక్రవారం స్థానికంగా వాహనా తనిఖీ చేపట్టారు. ఆ టైంలో ఇన్నోవా కారులో మోకిల నుంచి నవాబుపేటకు వస్తున్న మరుగు రవీందర్ రావును ఆపి తనిఖీ చేయగా, కారులో రూ.కోటి5 లక్షలు దొరికాయి. ఎలాంటి డాక్యుమెంట్లు చూపించకపోవడంతో సీజ్​చేసినట్లు సీఐ తెలిపారు.

కూకట్​పల్లిలో రూ.1.37లక్షలు

బాలానగర్​ ఎస్ఓటీ, కేపీహెచ్​బీ పోలీసులు శుక్రవారం చేపట్టిన తనిఖీల్లో రూ.1.37లక్షలు పట్టుకున్నారు. రైటర్ సేఫ్​ గార్డ్​ నగదు తరలింపు సంస్థలో పనిచేస్తున్న గార్డ్స్ జి.మల్లేశ్(60), గోగికర్​ లన్మోల్​(22), డ్రైవర్​బి.తరుణ్​(21) శుక్రవారం మధ్యాహ్నం కేపీహెచ్​బీకాలనీ నెక్సస్​ మాల్​ సమీపంలో కారులో నగదును తరలిస్తుండగా అనుమానంతో పోలీసులు తనిఖీ చేశారు. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా తరలిస్తున్న రూ.1,37,635ను స్వాధీనం చేసుకున్నారు.