- కర్నాటక తొలి ఇన్నింగ్స్‌లో 220/5
- దెబ్బ కొట్టిన జమ్మూ బౌలర్ నబీ
హుబ్బళి: కర్నాటకతో రంజీ ట్రోఫీ ఫైనల్లో జమ్మూ కాశ్మీర్ ఆధిపత్యమే కొనసాగుతోంది. మయాంక్ అగర్వాల్ (130 బ్యాటింగ్) సెంచరీతో చెలరేగినా.. మిగతా బ్యాటర్లు నిరాశపర్చడంతో.. గురువారం మూడో రోజు ఆట ముగిసే టైమ్‌కు కర్నాటక తొలి ఇన్నింగ్స్‌లో 69 ఓవర్లలో 220/5 స్కోరు చేసింది. మయాంక్‌తో పాటు కృతిక్ కృష్ణ (27 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆరంభం నుంచే జమ్మూ పేసర్ ఆకిబ్ నబీ (3/32) కర్నాటక టాపార్డర్‌ను శాసించాడు. 27 రన్స్ వద్ద కేఎల్ రాహుల్ (13)ను ఔట్ చేశాడు. ఆ వెంటనే సునీల్ కుమార్ (1/45).. దేవదత్ పడిక్కల్ (11)ను పెవిలియన్‌కు పంపాడు. ఇక 18వ ఓవర్‌లో వరుస బాల్స్‌లో కరుణ్ నాయర్ (0), రవిచంద్రన్ స్మరన్ (0)ను నబీ డకౌట్ చేశాడు. ఫలితంగా కర్నాటక 57/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో మయాంక్‌కు తోడైన శ్రేయస్ గోపాల్ (27) మెరుగ్గా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరు కలిసి జమ్మూ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో మయాంక్ 82 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే ఇన్నింగ్స్ 49వ ఓవర్‌లో యుధ్వీర్ సింగ్ (1/32).. శ్రేయస్‌ను ఔట్ చేసి ఐదో వికెట్‌కు 105 రన్స్ భాగస్వామ్యాన్ని ముగించాడు. చివర్లో కృతిక్ కృష్ణతో కలిసి స్ట్రయిక్ రొటేట్ చేసిన మయాంక్ 153 బాల్స్‌లో సెంచరీ అందుకున్నాడు. ఈ ఇద్దరు ఆరో వికెట్‌కు 58 రన్స్ జత చేసి మరో వికెట్ పడకుండా రోజు ముగించారు. ప్రస్తుతం కర్నాటక ఇంకా 364 రన్స్ వెనకబడి ఉంది. అంతకుముందు 527/6 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన జమ్మూ తొలి ఇన్నింగ్స్‌లో 173.1 ఓవర్లలో 584 రన్స్‌కు ఆలౌటైంది. సాహిల్ లోత్రా (72), అబిద్ ముస్తాక్ (28), యుధ్వీర్ సింగ్ (30) మెరుగ్గా ఆడారు. ప్రసిధ్ కృష్ణ 5 వికెట్లు పడగొట్టాడు.
