ఉ. 9.20 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో లైవ్
హోబర్ట్: సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కోసం ఇండియా అమ్మాయిలు రెడీ అయ్యారు. శుక్రవారం ఆస్ట్రేలియా విమెన్స్‌తో జరిగే రెండో వన్డేలో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది జరగాలంటే బ్యాటింగ్ పెర్ఫామెన్స్‌పై టీమిండియా ఎక్కువగా ఫోకస్ చేయాలి. అయితే ఈ ఫార్మాట్‌లో ఆసీస్ ఆధిపత్యమే ఎక్కువగా నడుస్తుండటం ఇండియాను ఆందోళనలో పడేసింది. ఇప్పటి వరకు జరిగిన 11 సిరీస్‌ల్లోనూ కంగారూలే నెగ్గారు. చివరిసారిగా 2024లో 3–0తో, సెప్టెంబర్ 2025లో 2–1తో ఇండియాపై నెగ్గారు. అయితే గతేడాది విమెన్స్ వరల్డ్ కప్ సెమీస్‌లో ఆసీస్ నెగ్గిన టీమిండియా అదే స్ఫూర్తితో ఈ మ్యాచ్ ఆడాలని భావిస్తోంది. బ్యాటింగ్‌లో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, కశ్వీ గౌతమ్ ఫర్వాలేదనిపించినా.. ఆస్ట్రేలియన్ క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ ముందు మిగతా వారు తేలిపోయారు. ఓపెనింగ్‌లో ప్రతీక రావల్ డకౌట్ కాగా, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ సందర్భానికి తగినట్లుగా ఆడలేకపోయారు. హిట్టర్ రిచా ఘోష్ కూడా తడబడటం ఇండియాకు మైనస్‌గా మారింది. కనీసం రెండో వన్డేల్లోనైనా వీళ్లందరూ బ్యాట్లు ఝుళిపిస్తారేమో చూడాలి. బౌలింగ్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీ చరణి మెరుస్తున్నా.. దీప్తి శర్మ, కశ్వీ గౌతమ్ సరైన మద్దతు ఇవ్వలేకపోతున్నారు. అయితే మెరుగైన ఆరంభం ఇవ్వాల్సిన బాధ్యత పేసర్లు రేణుకా సింగ్, క్రాంతి గౌడ్‌పై ఎక్కువగా ఉంది.
