అగ్గిపెట్టెతో ఆడుతూ.. కుక్క పిల్లలను కాల్చి చంపేసిన పిల్లలు

అగ్గిపెట్టెతో ఆడుతూ.. కుక్క పిల్లలను కాల్చి చంపేసిన పిల్లలు

పిల్లలంటేనే పిడుగులు.. ఉన్నతాట ఉండరు. చెప్పింది వినకుండా అన్నీ తీట పనులు చేస్తుంటారు.  వాళ్లకు తప్పేదో  రైటేదో .. వేటితో ఆడుకోవాలో..వేటితో ఆడకూడదో కూడా తెల్వదు. తల్లిదండ్రులు ఓ కంట వారిని చూస్తుండాలి. లేకపోతే  కొన్ని సార్లు ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. కొన్ని సార్లు ప్రమాదాలు తలపెడతారు.  లేటెస్ట్ గా యూపీలోని కాన్పర్ లో  ఓ ముగ్గురు  పిల్లలు అగ్గిపెట్టెతో  ఆడుకుంటూ ఆడుకుంటూ  కుక్కపిల్లలను కాల్చి చంపారు.

కాన్పూర్‌లోని కిద్వాయ్ నగర్ ప్రాంతంలోని ఒక పార్కులో ముగ్గురు మైనర్ బాలురు నాలుగు వీధి కుక్క పిల్లలను కాల్చి చంపారు.  బేగంపూర్వా ప్రాంతానికి చెందిన 8 నుంచి10 సంవత్సరాల మధ్య వయస్సు గల ముగ్గురు పిల్లలు కిద్వాయ్ నగర్‌లోని గీతా పార్క్ జి బ్లాక్‌లో ఆడుకుంటూ  కుక్కపిల్లల షెల్టర్‌కు నిప్పు పెట్టారు. ఇంటి నుంచి అగ్గిపెట్టె తెచ్చి కుక్కపిల్లల షెల్టర్‌కు నిప్పంటించారని ఓ చిన్నారి చెప్పాడు.

ఎండుగడ్డితో నిర్మించిన ఆ  కుక్కపిల్లల షెల్టర్‌పై బాలుడు కాలుతున్న అగ్గిపుల్లని విసిరేయడంతో, కుక్కపిల్లలు తప్పించుకునే అవకాశం లేకుండా మంటలు వ్యాపించాయి. శబ్దం విన్న స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.  కానీ అప్పటికే  నాలుగు కుక్కపిల్లలు సజీవ దహనమయ్యాయని స్థానికులు తెలిపారు.

కుక్కపిల్లలకు జలుబు రాకుండా ఉండేందుకు స్థానికులు గడ్డి, జనపనార బస్తాలతో పార్కులో చిన్నపాటి షెల్టర్ వేశారు.  ముగ్గురు పిల్లలు అగ్గిపెట్టెతో ఆడుకుంటూ కుక్కల షెల్టర్ కు నిప్పంటించారు..దీంతో నాలుగు కుక్క పిల్లలు చనిపోయాయని ఓ పోలీసు అధికారి తెలిపారు.  ఈ ఘటనపై  చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ బాబూ పూర్వా అమర్‌నాథ్‌ యాదవ్‌ తెలిపారు.