బైక్ దొంగపై ఫస్ట్ కేసు .. అమల్లోకి కొత్త చట్టాలు

బైక్ దొంగపై ఫస్ట్ కేసు .. అమల్లోకి కొత్త చట్టాలు
  • భారత నేర న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయం
  • ఇక ఎక్కడి నుంచైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం

న్యూఢిల్లీ: బ్రిటిష్​కాలంనాటి కాలం చెల్లిన చట్టాల  ప్రస్థానం ముగిసింది. భారతీయ న్యాయ వ్యవస్థలో నూతన అధ్యాయం మొదలైంది. సోమవారం నుంచి 3 కొత్త క్రిమినల్​ చట్టాలు అమల్లోకి వచ్చాయి. భారత శిక్షా స్మృతి (ఐపీసీ), కోడ్‌‌ ఆఫ్‌‌ క్రిమినల్‌‌ ప్రొసీజర్‌‌(సీఆర్‌‌పీసీ), భారత సాక్ష్యాధార చట్టాల స్థానంలో కేంద్ర సర్కారు 3 కొత్త నేర చట్టాలను రూపొందించింది.  భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్​), భారతీయ నాగరిక్‌‌ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్​), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్ఏ) చట్టాలను  గత డిసెంబర్​లో పార్లమెంట్​ ఆమోదించింది.

ఇందులో  ప్రస్తుత కాలానికి, సాంకేతికతలకు అనుగుణంగా అనేక కొత్త నిబంధనలను చేర్చారు. కాగా, ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చిన ఈ కొత్త చట్టాల కింద తొలి కేసు మధ్యప్రదేశ్​లో నమోదైందని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా చెప్పారు. ఓ బైక్ దొంగపై పోలీసులు అర్ధరాత్రి 00:10 నిమిషాలకు కేసు ఫైల్ చేశారని అమిత్​ షా చెప్పారు. కొత్త చట్టాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్​మాట్లాడుతూ..  "బీఎన్ఎస్​ చట్టం కింద మొదటి ఎఫ్‌‌ఐఆర్ ఓ చిరు వ్యాపారిపై నమోదు చేశారు.

కమలా మార్కెట్ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద అతను కార్ట్‌‌లో నీరు, పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్నాడు. పబ్లిక్ వేలో వ్యాపారం చేశాడనే అభియోగంతో అతనిపై ఢిల్లీ పోలీసులు బీఎన్ఎస్ కింద మొదటి ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేశారు. ఇది న్యాయమేనా..?" అని ప్రశ్నించారు. అయితే, ఈ ఆరోపణలను అమిత్ షా తోసిపుచ్చారు. తొలి కేసు మధ్యప్రదేశ్​లోనే నమోదైందని స్పష్టం చేశారు.

చట్టాల్లో ప్రధాన మార్పులివే..

చట్టపరమైన ప్రక్రియలో సమర్థత, న్యాయాన్ని పెంపొందించే లక్ష్యంతో రాబోయే చట్టాల్లో అనేక ప్రొగ్రెసివ్​ ప్రొవిజన్స్​ను ప్రవేశపెట్టారు.  ఏ పోలీస్​ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేసేలా జీరో ఎఫ్​ఐఆర్ ​లాంటి విధానాన్ని తీసుకొచ్చారు. ఆన్​లైన్​లో ఫిర్యాదు, ఎస్‌‌ఎంఎస్‌‌ రూపంలో సమన్లు,  హేయమైన నేరాల్లో క్రైమ్‌‌ సీన్​ వీడియో రికార్డింగ్​ వంటి ఆధునిక పద్ధతులు రానున్నాయి. పేపర్​ వర్క్​ తగ్గించి, కమ్యూనికేషన్​ను మెరుగుపర్చడమే లక్ష్యంగా ఈ చట్టాలను రూపొందించారు. 45 రోజుల్లో తీర్పులు, 60 రోజుల్లో శిక్ష విధించేలా మార్పులు చేశారు.

మహిళలు, పిల్లలపై జరిగే నేరాల్లో సున్నితంగా వ్యవహరించేలా.. వేగంగా వైద్య పరీక్ష ​జరిగేలా చేంజెస్​ తీసుకొచ్చారు. టెర్రరిజం సమగ్ర నిర్వచనంతోపాటు వివాహానికి సంబంధించి తప్పుడు వాగ్ధానాలు, మైనర్లపై సామూహిక అత్యాచారం వంటి వాటికి కొత్త నిర్వచనం. తప్పుడు వాగ్దానాలతో లైంగిక సంబంధాల్లో పాల్గొనే వ్యక్తులకు గరిష్టంగా పదేండ్ల జైలు శిక్షతోపాటు ఫైన్ ​విధించేలా బీఎన్ఎస్ఎస్​ చట్టంలోని క్లాజ్​ 69 ను రూపొందించారు.

లవ్​ జిహాద్’ లాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు దీన్ని చేర్చినట్టు విమర్శకులు పేర్కొంటున్నారు. బీఎన్ఎస్ఎస్ ​ క్లాజ్ 103 ప్రకారం, జాతి, కులం లేదా కమ్యూనిటీ ఆధారంగా హత్యను ప్రత్యేక నేరంగా గుర్తిస్తారు. దీనికి ఇప్పుడున్న ఏడేళ్ల శిక్ష ఇకపై యావజ్జీవంగా మార్చారు.