24 గంటల్లో మూడు భూకంపాలు..2300 మంది మృతి

24 గంటల్లో మూడు భూకంపాలు..2300 మంది మృతి

టర్కీ, సిరియా దేశాలు వరుస భూకంపాలతో వణికిపోతున్నాయి. 24 గంటల వ్యవధిలోనే మూడు భూకంపాలు టర్కీని కుదిపేశాయి. దీంతో మృతుల సంఖ్య 2300 దాటింది. దక్షిణ టర్కీలోని గజియాన్‌టెప్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1.24 గంటలకు 7.5 తీవ్రతతో రెండోసారి, ఆ తర్వాత కొద్దిసేపటికే 6.0 తీవ్రతతో మూడోసారి భూకంపాలు టర్కీని కకావికలం చేశాయి. 

శిథిలాల కింద వందలాది మంది చిక్కుకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెబున్నారు. టర్కీలో మలట్యా, ఉర్ఫా, ఒస్మానియా, దియర్బ్కర్ ప్రాంతాల్లో భూకంప ప్రభావం అధికంగా ఉండగా.. సిరియాలో అలెప్పో, హమా, లటాకియాలో అనేక భవనాలు కుప్పకూలిపోయాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు వెంటనే చేరుకొని, సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు.. ఈ భారీ భూకంపం దెబ్బకు ప్రజలందరూ తమ ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వం ఇళ్లల్లోకి వెళ్లొద్దని సూచించింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.

1939 తర్వాత దేశంలో ఇదే అతిపెద్ద విపత్తు అని, భూకంపంలో 2,818 భవనాలు నేలమట్టమయ్యాయని టర్కీ అధ్యక్షుడు రెకెప్ తయ్యిప్ ప్రకటించారు. ప్రపంచ దేశాలు టర్కీ, సిరియాకు సంఘీభావం ప్రకటించాయి. ఈ విపత్కర పరిస్థితిలో సాయం అందిస్తామనని చెప్పాయి. భారత్ కూడా తన వంతు సాయంగా ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు, వైద్య బృందాలతో పాటు సహాయ సామగ్రిని టర్కీకి పంపింది.ఇదిలావుండగా.. టర్కీలో భూకంపాలు తరచూ సంభవిస్తూనే ఉంటాయి. 2020లో జనవరి నెలలో ఇలాజిగ్ ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు.. 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయాలపాలయ్యారు.