
ఆ గ్రామంలో యువకులంతా పోలీసులే
చేవెళ్ల, వెలుగు: పట్టుదల, ఏకాగ్రత ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు చేవెళ్ల నియోజకవర్గం ఆలూరు యువత. రాష్ర్టంలోని ఏ పోలీస్ స్టేషన్ కు వెళ్లినా ఆలూరు గ్రామానికి చెందిన కానిస్టేబుళ్లు కనిపిస్తారు. అంతేగాక ప్రతి ఇంటి నుంచి ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉండటం ఇక్కడి విశేషం. అంతేగాక కానిస్టేబుల్‌గా ఎన్నికైన వారు అంతటితో ఆగకుండా ఆ ఉద్యోగం చేస్తూనే ఉన్నత స్థాయి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటారు. ఈ గ్రామంలో ఇప్పటికే 600 మంది వరకు పోలీసు కానిస్టేబుల్స్ ఉంటారు. ఇటీవల ప్రకటించిన పోలీసు కానిస్టేబుల్స్ పరీక్షల ఫలితాలలో జిల్లా వ్యాప్తంగా 100 మంది వరకు ఉద్యోగాలు సాధించారు. వీరిలో చేవెళ్ల మండలంలో 50 మంది వరకు ఉద్యోగం పొందగా ఒక్క ఆలూరు గ్రామంలోనే ఏకంగా 30మంది యువకులు ఉద్యోగాలు పొందారు. వీరిలో మహిళలు 8 మంది ఉండటం మరో విశేషం.
ఒకే ఊరిలో 17 మంది సెలెక్ట్
తల్లాడ, వెలుగు: కానిస్టేబుల్ ఫలితాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తల్లాడ మండలంలోని మల్లారం గ్రామ యువత సత్తా చాటారు. ఒకే గ్రామం నుంచి 17 మంది కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. 2016లోనూ 17 మంది ఇక్కడి నుంచి కానిస్టేబుళ్లుగా సెలెక్ట్ కావడం విశేషం. నరేశ్ అనే యువకుడు పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూనే పరీక్షకు ప్రిపేర్ అయ్యాడు. ఇప్పుడు ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించాడు. 1994 సంవత్సరం నుండి 2019 వ సంవత్సరం వరకు గ్రామంలో 60 మంది పోలీసు ఉద్యోగాలు సాధించారు. 2016 లో 17 పోస్టులు, ఈ సంవత్సరం 17 పోస్టులు సాధించారు. గతంలోనే 25 మంది ఉద్యోగాలు సాధించి విధులు నిర్వహిస్తున్నారు. పోలీసు ఉద్యోగాలు ఎప్పుడు నోటిఫికేషన్ విడుదలైనా దాదాపు 30 నుండి 40 మంది యువకులు దరఖాస్తు చేస్తారు.