
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసు నియమాల ప్రకారం 30 రోజులు లీవ్ పెట్టుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిని వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడంతో పాటు వ్యక్తిగత అవసరాల కోసం కూడా వాడుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు గురువారం రాజ్యసభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
‘‘సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవు) నిబంధనలు 1972 ప్రకారం.. ఉద్యోగికి 30 రోజుల ఆర్జిత సెలవులు, 20 రోజులు సగం జీతంతో కూడిన సెలవు, 8 రోజులు క్యాజువల్ లీవ్స్, ఏడాదికి రెండు రోజులు పరిమిత సెలవులు అందిస్తుంది. వీటిని వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం వంటి వ్యక్తిగత కారణాలు చూపి పొందవచ్చు”అని కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు.