అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ( మే 26 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నెదొడ్డి గ్రామం దగ్గర నేషనల్ హైవే 44పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి అనంతపురం వైపు వెళ్తున్న కేకే ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడంతో ప్రమాదం జరిగింది. దీంతో బస్సు మూడు పల్టీలు కొట్టి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న గుత్తి పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే... పది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వారిని అనంతపురం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించామని తెలిపారు పోలీసులు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునాన్రు గుత్తి పోలీసులు. బస్సు అతి వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం, వాహన ఫిట్‌నెస్ వంటి అంశాలను పరిశీలిస్తున్నారు పోలీసులు.రాత్రిపూట లాంగ్ రూట్లలో వెళ్లే బస్సు డ్రైవర్ అలసట, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్న క్రమంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు.
