రాముడి గుడి ​కోసం 30 ఏండ్లుగా మౌన వ్రతం

రాముడి గుడి ​కోసం 30 ఏండ్లుగా మౌన వ్రతం

 ధన్‌‌‌‌బాద్: శ్రీరాముడు అంటే ఎంతో భక్తి కలిగిన జార్ఖండ్​కు చెందిన 85 ఏండ్ల సరస్వతి అనే మహిళ అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించే వరకు మాట్లాడనని 30 ఏండ్లుగా మౌన వ్రతం చేస్తున్నది. ఈ నెల 22న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ రోజు ఆమె మౌనం వీడనున్నారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ఆమె అయోధ్యకు వెళ్లారు. అక్కడ రామ మందిరాన్ని నిర్మించేంత వరకు తాను ‘మౌన వ్రతం’ చేస్తానని నిర్ణయించుకున్నారు. 

అప్పటి నుంచి రోజులో 23 గంటలు ఎవరితో మాట్లాడటం లేదు. ఏదైనా కావాలంటే సైగలతో అడుగుతారు. ఒక గంట మాత్రం కుటుంబసభ్యులతో మాట్లాడేవారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం 2020లో ప్రధాని మోదీ భూమి పూజ చేసిన తర్వాత.. ఆమె 24 గంటల మౌనవ్రతం పట్టినట్లు సరస్వతి దేవి కుటుంబసభ్యులు వెల్లడించారు. 

ఆలయ ప్రతిష్ఠాపన తేదీ ప్రకటించినప్పటి నుంచి ఆమె ఎంతో ఆనందంగా ఉంటున్నారు. సోమవారం రాత్రి అయోధ్యకు బయల్దేరిన దేవి.. ప్రాణప్రతిష్ఠ పూర్తయిన తర్వాత మౌనవ్రతాన్ని వీడనున్నట్లు ఆమె కుమారుడు తెలిపారు. స్థానికంగా ఆమెను ‘మౌని మాత’గా పిలుస్తారు. సరస్వతి భర్త1986లో చనిపోయారు. అప్పటి నుంచి ఆమె తన జీవితాన్ని శ్రీరాముడికి అర్పించి.. నిత్యం తీర్థయాత్రల్లో గడుపుతున్నారు.