బదిలీల తీరుపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం

బదిలీల తీరుపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం
  • తాజాగా ఎనిమల్​ హస్బెండరీలో సీనియర్లకు అన్యాయం
  • అలకేషన్ చేసిన చోట జూనియర్లకే పెద్దపీట
  • మారుమూల ప్రాంతాలకు సీనియర్లు
  • రబ్బర్ స్టాంపుల్లా మారిన జోనల్ ఆఫీసర్లు
  • ట్రాన్స్ఫర్ల తీరుపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: 317 జీఓ ఎఫెక్ట్​ఎడ్యుకేషన్​డిపార్ట్​మెంట్​తో పాటు అన్ని ప్రభుత్వ శాఖలపై పడుతోంది. అలకేషన్​ తర్వాత సీనియారిటీ ప్రకారం పోస్టులు కేటాయించకుండా అప్పటికే ఉన్న జూనియర్లను అలాగే ఉంచి, సీనియర్లను బలిపశువులను చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జోనల్​ స్థాయిలోనూ సీనియర్లను మారుమూల ప్రాంతాల్లోని వేకెన్సీ పోస్టులకు పంపిస్తున్నారు. తాజాగా ఎనిమల్​హస్బెండరీ డిపార్ట్‌‌మెంట్‌‌లో  ఈ నెల 12న జారీ అయిన మెమోను చూసి ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. 
సీనియర్లకు మొండిచెయ్యి
జీవో 317 ప్రకారం అన్ని డిపార్ట్​మెంట్లలోనూ కొత్త జోన్‌‌ల ప్రాతిపదికన ట్రాన్స్​ఫర్లు చేపడుతున్నారు. ఎనిమల్‌‌ హస్బెండరీ డిపార్ట్‌‌మెంట్‌‌లో లైవ్‌‌స్టాక్‌‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 70 మంది ఉద్యోగులను ఇటీవల ఏడు కొత్త జోన్లకు బదిలీ చేశారు. కాళేశ్వరం జోన్‌‌కు 18 మంది, బాసరకు 10, రాజన్న కు 8, భద్రాద్రికి 8, యాదాద్రి 3,చార్మినార్‌‌ 3, జోగులాంబకు 20 మందిని కేటాయించారు.  ఉమ్మడి ఏపీలోని 5వ జోన్‌‌ పరిధిలో పూర్వ వరంగల్‌‌, ఖమ్మం, ఆదిలాబాద్‌‌, కరీంనగర్‌‌ జిల్లాలు ఉండేవి. ఎనిమల్‌‌ హస్బెండరీ డిపార్ట్‌‌మెంట్‌‌లో ఈ జోన్‌‌ పరిధిలో 147 మంది లైవ్‌‌ స్టాక్‌‌ అసిస్టెంట్లు ఉండగా ఏ జిల్లాకు చెందినవాళ్లు అదే జిల్లాలో పనిచేసేవారు. వీరిలో నుంచి ఇటీవల 4వ జోన్‌‌ పరిధిలో ఉన్న భద్రాద్రి జోన్‌కు 68 మంది లైవ్‌‌స్టాక్‌‌ అసిస్టెంట్లను కేటాయించారు. కానీ ఇందులో సీనియారిటీ లిస్ట్‌‌ ప్రకారం 1 నుంచి 16వ స్థానం వరకు ఉన్న 8 మంది ఉద్యోగులు కూడా వారు కోరుకున్న జిల్లా కాకుండా వేరే జిల్లాలకు వెళ్లాల్సి వస్తోంది. 
ఇవిగో ఉదాహరణలు.. 
పూర్వ 5వ జోన్‌‌ పరిధిలో గల వరంగల్‌‌ ఉమ్మడి జిల్లాలో పనిచేసిన లైవ్‌‌స్టాక్‌‌ అసిస్టెంట్లు మధుకర్‌‌, కార్తీక, రజిత, సుమన్‌‌ జిత్ర, సుమన్‌‌, కవిత, రాజేశ్‌‌ ఖన్నా ఇదే జిల్లా నుంచి వేరుపడిన ములుగు, భూపాలపల్లి, జనగామ జిల్లాలో పనిచేసేవారు. కొత్తగా ఏర్పడిన  జోన్‌ల ప్రకారం వీరు సొంత జోన్‌ అయిన భద్రాద్రి‌‌లోకి మారాల్సి వచ్చింది. ఈ జోన్‌‌లో మొత్తం 68 మంది ఉద్యోగులను కేటాయించారు. సీనియారిటీ ప్రకారం వీరంతా 10వ స్థానంలోపే ఉన్నారు. మిగిలిన 61 మందిలో వీరికంటే 30 మంది వరకు జూనియర్లు ఉన్నారు. అయినా వీరంతా జోన్‌‌ మారలేదు కాబట్టి ప్రస్తుతం పనిచేస్తున్న చోటే కొనసాగిస్తున్నారు. వేరే జోన్‌‌ నుంచి ఈ జోన్‌‌కి వచ్చారనే ఒకే ఒక్క కారణంతో సీనియర్లు అయినప్పటికీ ఈ ఏడుగురుని పూర్వ ఖమ్మం జిల్లాకు పంపించడానికి ఏర్పాట్లు చేశారు.
ఖాళీలు ఒకచోట.. కేటాయింపులు మరోచోట 
317 జీవో ప్రకారం  వేరే జిల్లాలకు ట్రాన్స్​ఫర్​అయిన ఉద్యోగుల ఖాళీలను ఎనిమల్‌‌ హస్బెండరీ డిపార్ట్‌‌మెంట్‌‌ హయ్యర్‌‌ అఫిషియల్స్‌‌ దాచిపెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. జోన్లు మారిన సీనియర్‌‌ ఉద్యోగులకు వారు కోరుకున్నచోట పోస్టింగ్‌‌లు ఇవ్వకుండా ఎప్పటినుంచో ఖాళీగా ఉన్న పోస్టుల్లో చేరేలా కొత్తగా ఆర్డర్స్‌‌ ఇచ్చారు. భద్రాద్రి జోన్‌‌ పరిధిలో గల హనుమకొండలో దండెపల్లి, కొత్తకొండ, మల్లారం, పెద్దాపూర్‌‌, వంగపహాడ్‌‌, పులిగిల్ల,  రాంపూర్‌‌, మహబూబాబాద్‌‌ జిల్లాలో నాంచార్‌‌ మడూర్‌‌, తానంచెర్ల, ఔతాపూర్‌‌, చిన్న ముప్పారం,  పెద్దవంగర,  వరంగల్‌‌ నుంచి మేడపల్లి, ఏనుగల్‌‌, కొండూరు, రెడ్లవాడ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోగాగుల గూడెం, ఖమ్మం జిల్లాలో ఆర్‌‌.కొత్తగూడెం పోస్టులు ఖాళీ అయ్యాయి.

కానీ ఈ జోన్‌‌లో చేరడానికి పోస్టింగ్‌‌ కోసం ఎదురుచూస్తున్న 8 మంది ఉద్యోగులకు వేరే ఖాళీలు చూపించారు. హయ్యర్‌‌ ఆఫీసర్లు ఈ జోన్‌‌ పరిధిలో 22 పోస్టులు ఖాళీ కాగా ఔతాపూర్‌‌ మినహా మిగిలిన 7 పోస్టులను కొత్తవి చూపించారు. 317 జీవో ప్రకారం ఖాళీ అయిన 21 పోస్టులను చూపించలేదు. దీనిపై  ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. నిజానికి ట్రాన్స్​ఫర్​అయిన ఉద్యోగుల పోస్టింగ్‌‌లు చూసుకోవడం కోసం ఎనిమల్‌‌ హస్బెండరీ డిపార్ట్‌‌మెంట్‌‌ నుంచి 7 జోన్లకు స్పెషల్​గా జోనల్‌‌ ఆఫీసర్లను నియమించారు. ఉద్యోగుల బదిలీల విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే వీళ్లు గవర్నమెంట్‌‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలి. కానీ హైదరాబాద్​ స్థాయి నుంచే ట్రాన్స్​ఫర్స్, అలకేషన్స్ మానిటరింగ్​ చేయడంతో వీళ్లంతా డమ్మీలయ్యారనే విమర్శలు వస్తున్నాయి. 
8 ఏండ్లుగా ఏజెన్సీలో పని చేస్తున్న
వరంగల్‌‌ ఉమ్మడి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమైన తాడ్వాయి మండలం నార్లాపూర్‌‌లో లైవ్‌‌ స్టాక్‌‌ అసిస్టెంట్‌‌గా 8 ఏండ్లుగా పనిచేస్తున్న. ఇది ప్రస్తుతం ములుగు జిల్లాలోకి మారింది. దీంతో మా సొంత జిల్లా అయిన హనుమకొండలో పనిచేయడానికి జీవో 317 ప్రకారం ఆప్షన్‌‌ ఇస్తే నాకు భద్రాద్రి జోన్‌‌ కేటాయించారు. ఈ జోన్‌‌లో 22 ఖాళీలు ఉండగా ఉమ్మడి వరంగల్‌‌ జిల్లా పరిధిలో 20 ఖాళీలు ఉన్నాయి. అయినా ఈ ఉమ్మడి జిల్లాలో కేవలం 3 పోస్టులు మాత్రమే చూపించారు. మిగిలిన 5 ఖాళీలను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూపించారు. సినియారిటీ  ప్రకారం 10వ స్థానంలో ఉన్నప్పటికీ నేను మళ్లీ భద్రాద్రి కొత్తగూడెం లేదంటే ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో పనిచేయాల్సి వస్తుంది.  ‒ఎ.కవిత, ఎల్‌‌ఎస్‌‌ఏ, హనుమకొండ
సీనియారిటీ ఉండి ఏం లాభం?
నేను ములుగు జిల్లా మదనపల్లిలో ఎల్‌‌ఎస్‌‌ఏగా పనిచేస్తున్నా. ఇది కాళేశ్వరం జోన్‌‌లోకి పోయింది. నాకు సొంత జిల్లా ఉన్న జోన్‌‌లోకి ట్రాన్స్‌‌ఫర్‌‌ అయ్యిందని సంబరపడ్డ. మా జోన్‌‌లో 68 మంది ఉద్యోగులు ఉంటే వీరిలో నాది సీనియారిటీ ప్రకారం 5వ నంబర్‌.‌ కానీ నేను హనుమకొండ, వరంగల్‌‌, మహబూబాబాద్‌‌ జిల్లాల్లో  పనిచేయకుండా కొత్తగా ఇచ్చిన ఆర్డర్స్‌‌ అడ్డు వస్తున్నాయి.  నాకంటే జూనియర్లు మంచి పోస్టింగ్‌‌లలో పని చేస్తుంటే సీనియారిటీ ఉండి పక్క జిల్లాకు పోవాల్సి వస్తోంది. ‒ సుమన్ జిత్రా, ఎల్‌‌ఎస్‌‌ఏ, మదనపల్లి, ములుగు