- స్మగ్లర్ యూపీఐలో ఫోన్ నంబర్ల ఆధారంగా పట్టివేత
- టెస్టుల్లో ఇద్దరు విద్యార్థినులు సహా 9 మందికి పాజిటివ్
- తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్, వార్డెన్ల సమక్షంలో కౌన్సెలింగ్
- డీ అడిక్షన్ సెంటర్‌కు తరలింపు
- ఇద్దరు గంజాయి సప్లయర్స్ అరెస్ట్.. 6 కిలోల గంజాయి సీజ్
హైదరాబాద్, వెలుగు: గంజాయికి బానిసగా మారిన కాబోయే డాక్టర్లు పోలీసులకు చిక్కారు. కాలేజీ క్యాంపస్‌లు, హాస్టల్స్ అడ్డాగా చేసుకొని మత్తులో జోగుతున్న స్టూడెంట్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘన్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీకి చెందిన 32 మంది మెడికోలు గంజాయి కస్టమర్లుగా ఈగల్ (ఎలైట్‌యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్‌లా ఎన్‌ఫోర్స్‌మెంట్) టీమ్‌కు దొరికారు. ఇందులో 24 మందికి యూరిన్ టెస్ట్ చేయగా.. ఇద్దరు విద్యార్థినులుసహా 9 మందికి గంజాయి పాజిటివ్ వచ్చింది. వీరికి తల్లిదండ్రులు, కాలేజీ ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్ సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. పాజిటివ్ వచ్చిన 9 మంది మెడికోలను డీ అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. మెడికోలు టార్గెట్‌గా గంజాయి సప్లయ్ చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి, 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిలోని ఓ స్మగ్లర్ యూపీఐ ట్రాన్సాక్షన్ ఆధారంగా 100 మంది కస్టమర్లను గుర్తించారు. వారిలో 32 మంది మెడికోలే ఉన్నారు. కాగా,ఈ వివరాలను ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా గురువారం వెల్లడించారు.
ఈగల్ నిఘాలో చిక్కిన అరాఫత్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘన్‌పూర్‌లోని మెడికల్ కాలేజీ హాస్టల్ విద్యార్థులకు అరాఫత్ రెగ్యులర్‌గా గంజాయి సప్లయ్ చేసేవాడు. రాష్ట్రంలో మాదకద్రవ్యాలను కట్టడి చేయడంలో భాగంగా కస్టమర్లు, సప్లయర్ల నెట్‌వర్క్‌పై ఈగల్ టీమ్ నిఘా పెట్టింది. కస్టమర్లు, పాత నేరస్తుల డేటా ఆధారంగా సెర్చ్ ఆపరేషన్లు చేస్తున్నది. ఇందులో భాగంగా అరాఫత్ సమాచారం సేకరించింది. ఈ నెల ఒకటిన సికింద్రాబాద్‌లో అరాఫత్‌ను అరెస్ట్ చేసింది. సెల్‌ఫోన్, యూపీఐ ట్రాన్సాక్షన్ల ఆధారంగా 100 మంది కస్టమర్ల ఫోన్ నంబర్లను సేకరించింది. ఇందులో ఘన్‌పూర్‌లోని మెడికల్ కాలేజీకి చెందిన 32 మంది హాస్టల్ విద్యార్థులను గుర్తించింది. వీరిలో 24 మందికి డ్రగ్ టెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు విద్యార్ధినులు సహా 9 మంది మెడికోలకు గంజాయి పాజిటివ్ వచ్చింది.
బీదర్ డ్రగ్ సప్లయర్ అకౌంట్‌లో రూ.1.5 కోట్లు
అరాఫత్ ఇచ్చిన సమాచారం మేరకు బీదర్‌కు చెందిన గంజాయి సప్లయర్ జరీనా భానును మంగళవారం అరెస్ట్ చేశారు. ఈమె వద్ద రూ.లక్ష విలువ చేసే 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర, పార్లీ నుంచి కొనుగోలు చేసిన గంజాయిని హైదరాబాద్‌లోని లోకల్ సప్లయర్లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం ట్రాన్సాక్షన్లలో 51 మంది పెడ్లర్ల వివరాలను సేకరించారు. వీరి అకౌంట్ల నుంచి జరీనా అకౌంట్లకు రూ.20 లక్షలకు పైగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఇలా గత ఏడాదికాలంగా జరీనా రూ.1.5 కోట్లు విలువ చేసే గంజాయి విక్రయాలు చేసినట్లు గుర్తించారు. ఇందులో అరాఫత్‌కు చెందిన రూ.6 లక్షలకు సంబంధించిన ట్రాన్సాక్షన్లు సేకరించారు. గంజాయి కస్టమర్లు, సప్లయర్లు సహా మాదకద్రవ్యాల వినియోగం గురించి తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1908 లేదా 8712671111 ద్వారా సమాచారం అందించాలని ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా సూచించారు.
ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలే లక్ష్యంగా..
సికింద్రాబాద్ బొల్లారం రిసాల బజార్‌కు చెందిన అరాఫత్ అహ్మద్ ఖాన్(23) డ్రగ్స్, గంజాయికి బానిసయ్యాడు. కర్నాటకలోని బీదర్‌కు చెందిన జరీనా భాను(46) అనే మహిళ వద్ద కిలోల కొద్దీ గంజాయి కొనుగోలు చేసేవాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు తరలించి కస్టమర్లకు సప్లయ్ చేసేవాడు. సిటీ శివారు ప్రాంతాల్లోని ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీ విద్యార్ధులను టార్గెట్ చేశాడు. లిక్కర్‌సహా మాదకద్రవ్యాల మత్తుకు బానిసలైన స్టూడెంట్స్‌కు మొదట్లో తక్కువ ధరకు గంజాయిని అందించాడు. ఇలా చైన్ సిస్టమ్‌తో స్టూడెంట్స్ కస్టమర్ల నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. గంజాయి కొనుగోలు, అమ్మకాలకు గూగుల్ పే, ఫోన్‌పేలను వినియోగించాడు. ఈ క్రమంలోనే 2022లో తుకారంగేట్, 2024లో అల్వాల్ పీఎస్‌లో అరాఫత్‌పై కేసులు నమోదయ్యాయి. అల్వాల్ పీఎస్‌లో నమోదైన కేసులో పరారీలో ఉన్నాడు. ఆటో డ్రైవర్లు, కాలేజ్ స్టూడెంట్స్‌కు గంజాయి విక్రయించేవాడు. అరాఫత్ గంజాయి దందాలో వివిధ కాలేజీలు, ప్రైవేట్ హాస్టల్స్ విద్యార్ధులు కస్టమర్లుగా ఉన్నారు.
