ఇంట్లనే సీక్రెట్ డెన్.. పోలీసుల కండ్లుగప్పి పారిపోయిన యూపీ డ్రగ్ సిండికేట్ కింగ్‌‌పిన్ తస్లిమ్

ఇంట్లనే సీక్రెట్ డెన్.. పోలీసుల కండ్లుగప్పి పారిపోయిన యూపీ డ్రగ్ సిండికేట్ కింగ్‌‌పిన్ తస్లిమ్

మీరట్: ఉత్తరప్రదేశ్‌‌‌‌లోని డ్రగ్ సిండికేట్ కింగ్‌‌‌‌పిన్ తస్లిమ్‌‌‌‌.. తన ఇంట్లో సీక్రెట్ డెన్ నిర్మించుకున్నాడు. శుక్రవారం మీరట్‌‌‌‌లోని తస్లిమ్ ఇంట్లో తనిఖీలు నిర్వహించేందుకు పోలీసులు వెళ్లగా.. వాళ్ల కళ్లుగప్పి సీక్రెట్ బేస్‌‌‌‌మెంట్ ద్వారా అతడు తప్పించుకున్నాడు. ఈ క్రమంలో ఇంట్లోని బేస్‌‌‌‌మెంట్‌‌‌‌ను పోలీసులు గుర్తించి అవాక్కయ్యారు. అక్కడ డ్రగ్స్‌‌‌‌ను దాచిపెట్టేందుకు, దాక్కునేందుకు, పారిపోయేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి.

గ్రౌండ్‌‌‌‌ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌కు 15 అడుగుల లోతులో సీక్రెట్ బేస్‌‌‌‌మెంట్ నిర్మించిన తస్లిమ్.. అందులో పెద్ద ఎత్తున కుర్చీలు, కార్పెట్లు ఉంచాడు. డ్రగ్స్‌‌‌‌ను దాచిపెట్టేందుకు వాటిని ఉపయోగించినట్టు పోలీసులు గుర్తించారు. తస్లిమ్‌‌‌‌ పెద్ద ఎత్తున డ్రగ్స్‌‌‌‌ను రవాణా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు మీరట్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు నిఘా పెట్టి గురువారం తస్లిమ్ కొడుకు షాబాజ్, అనుచరుడు సల్మాన్‌‌‌‌ను అరెస్టు చేశారు. వాళ్లిద్దరి దగ్గరి నుంచి అర కిలోకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాతి రోజు తస్లిమ్ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. అయితే సీక్రెట్ బేస్‌‌‌‌మెంట్ ద్వారా అతడు పారిపోయాడు.

70కి పైగా కేసులు..
తస్లిమ్‌‌‌‌పై 70కి పైగా కేసులు ఉన్నాయి. అతడు చిన్నారుల ద్వారా కూడా డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. తస్లిమ్ ఇంతకుముందు పలుమార్లు అరెస్టు అయినప్పటికీ, ప్రస్తుతం బెయిల్‌‌‌‌పై బయటే ఉన్నాడు. గ్యాంగ్‌‌‌‌స్టర్ యాక్ట్ కింద అతనికి చెందిన పలు ఆస్తులను పోలీసులు సీజ్ చేశారు. కాగా, డ్రగ్ సిండికేట్ భరతం పట్టేందుకు యూపీ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. గత కొన్ని రోజులుగా నిఘా పెట్టి డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేస్తున్నారు. ఇటీవల యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్, పోలీసులు కలిసి 73 కిలోల గంజాయి పట్టుకున్నారు. దాన్ని ఇన్వర్టర్లలో దాచిపెట్టి రవాణా చేస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. అలాగే ఈ నెల 6న ఐదుగురు డ్రగ్ పెడ్లర్లను అదుపులోకి తీసుకుని, వాళ్ల దగ్గరి నుంచి 125 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.