ఫ్లోరిడా: రష్యా– ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో జెలెన్ స్కీ భేటీ అయ్యారు. ఈ చర్చల కోసం ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ అమెరికా చేరుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం (ఇండియాలో అర్ధరాత్రి దాటాక) మార్ ఎ లాగోలోని ట్రంప్ ఎస్టేట్‌కు వెళ్లి ట్రంప్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు రిసార్ట్ ముందు మీడియాతో మాట్లాడారు. తాజాగా జరుగుతున్న చర్చల్లో రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు, ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు కొత్త ప్రతిపాదనపై చర్చిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. చర్చల విషయంలో ఉక్రెయిన్ కు ఎలాంటి గడువు విధించలేదని స్పష్టం చేశారు. తమ ఫోకస్ మొత్తం రష్యాతో యుద్ధాన్ని ఆపడంపైనే కేంద్రీకరించామని ట్రంప్ పేర్కొన్నారు. శాంతి చర్చలు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయని భావిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. ఇప్పుడు ఈ చర్చలు ఓ కొలిక్కి రాకపోతే ఇప్పట్లో యుద్ధం ఆగే పరిస్థితి ఉండదని అన్నారు. కాగా, అంతకుముందు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో మాట్లాడారు.
