సంక్రాంతి పండుగకు పోయేదెట్లా ? రోడ్లు తవ్వి అలాగే వదిలేసిన కాంట్రాక్టర్.. విజయవాడ హైవేకు విస్తరణ కష్టాలు !

సంక్రాంతి పండుగకు పోయేదెట్లా ? రోడ్లు తవ్వి అలాగే వదిలేసిన కాంట్రాక్టర్.. విజయవాడ హైవేకు విస్తరణ కష్టాలు !
  • గడువు దాటి ఏడాదవుతున్నా వర్క్ కంప్లీట్ కాలే
  • రోడ్లు తవ్వి అలాగే వదిలేసిన కాంట్రాక్టర్
  • గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్​తో ప్రయాణికుల నరకయాతన
  • సంక్రాంతి పండుగకు పోయేదెట్లా?

హైదరాబాద్/నల్గొండ, వెలుగు: విజయవాడ హైవేకు విస్తరణ కష్టాలు తప్పట్లేదు. ఈ హైవేపై 17 బ్లాక్ స్పాట్లను తొలగించేందుకు చేపట్టిన పనులు.. ఏడాదిన్నర గడిచినా కంప్లీట్ కాలేదు. గడువు దాటి ఏడాది ముగిసినా.. ఎన్​హెచ్ఏఐ ఇంజనీర్లు పనులు పూర్తి చేయించలేకపోయారు. కాంట్రాక్టర్ రోడ్లను ఎక్కడికక్కడ తవ్వి అలాగే వదిలేశారు. సర్వీస్ రోడ్లు కూడా కంప్లీట్ చేయకుండా ఆపేశారు. 

దీంతో ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్న వాళ్లంతా గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్​లలో ఇరుక్కొని నరకం చూస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే సంక్రాంతి పండుగ టైమ్​లో ఆంధ్రాకు వెళ్లే వాళ్లతో ఈ రోడ్డుపై ప్రయాణించే వెహికల్స్ సంఖ్య ఇప్పటికంటే రెట్టింపు అవుతున్నది. అప్పుడు అయితే ఇంకా ఇబ్బందులు తప్పవని ప్రయాణీకులు అంటున్నారు.

రూ.325 కోట్లతో పనులు

హైదరాబాద్-–విజయవాడ మధ్య సుమారు 270 కి.మీ దూరం ఉంటుంది. సొంత వెహికల్​లో ప్రయాణించే వారికి ట్రాఫిక్ అంతరాయం లేకుంటే గమ్యానికి చేరుకోవడానికి 4 నుంచి 5 గంటల టైమ్ పడ్తది. ఈ రూట్​లో నార్మల్ డేస్​లో రోజుకు 50 వేలకు పైగా వెహికల్స్ రాకపోకలు సాగిస్తాయి. అదే సంక్రాంతి టైమ్​లో రోజుకు లక్షకు వెహికల్స్​ వెళ్తుంటాయి. రాష్ట్రంలోనే అతి రద్దీగా ఉండే ఎన్​హెచ్ రోడ్డు ఇది. అయితే, ఈ రోడ్డుపై 17 చోట్ల బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. 

వీటి వద్ద రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో చనిపోతున్నట్లుగా ఎన్​హెచ్​ఏఐ ఇంజనీర్లు గుర్తించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ఫ్లై ఓవర్లు లేకపోవడంతో నిత్యం యాక్సిడెంట్లు అవుతుండగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలున్నాయి. 

అండర్‌‌పాస్‌‌లు, ఫ్లై ఓవర్లు, అక్కడక్కడా రోడ్ల లేన్ విస్తరణ, సర్వీస్ రోడ్లు, సైన్‌‌ బోర్డుల వంటి పనులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ.325 కోట్లు కేటాయించింది. జాతీయ బ్లాక్ స్పాట్స్ రెక్టిఫికేషన్ ప్రోగ్రాం కింద 2024 జూన్​లో పనులు మొదలుపెట్టింది. 6 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. ఏడాదిన్నర దాటినా ఇంకా 30% వర్క్ కూడా పూర్తికాలేదు.

కొన్ని చోట్ల ఇంకా పనులే ప్రారంభం కాలే!

హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే రోడ్డుపై జరుగుతున్న బ్లాక్ స్పాట్ పనులను ఆదివారం ‘వీ6 వెలుగు’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని చౌటుప్పల్‌‌, పెద్దకాపర్తి, చిట్యాల, కట్టంగూరు, ఇనుపాముల, టేకుమట్ల, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఈనాడు జంక్షన్‌‌, జనగాం క్రాస్ రోడ్డు, పిల్లలమర్రి క్రాస్ రోడ్డు, దురాజ్‌‌పల్లి, ముకుందాపురం, ఆకుపాముల, కొమరబండ, కట్టకొమ్ముగూడెం, మేళ్లచెర్వు క్రాస్ రోడ్డు, మునగాల ప్రాంతాలను ఎన్​హెచ్​ఏఐ ఇంజనీర్లు బ్లాక్ స్పాట్లుగా గుర్తించారు. రూ.325 కోట్లతో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా అండర్‌‌ పాస్‌‌లు, బ్రిడ్జిలు, సర్వీసు రోడ్లు నిర్మించేందుకు పనులను చేపట్టారు. 

చౌటుప్పల్, చిట్యాల, పెద్ద కాపర్తి, సూర్యాపేట, ఈనాడు ఆఫీస్, కోదాడ వద్ద ఫ్లై ఓవర్లు నిర్మించాల్సి ఉండగా చౌటుప్పల్, కోదాడ వద్ద నేటికీ పనులు ప్రారంభించలేదు. చౌటుప్పల్ లో కేవలం సర్వీస్ రోడ్డు మాత్రమే వేశారు. చిట్యాల, పెద్ద కాపర్తి, సూర్యాపేట, ఈనాడు జంక్షన్ వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులు 30 శాతమే కంప్లీట్ అయ్యాయి. 

ట్రాఫిక్ జామ్ పరిస్థితి ఇదీ!

ఈ నేషనల్ హైవే రోడ్డుపై ఒక్కో బ్లాక్ స్పాట్ మధ్య దూరం సుమారు 20 కి.మీ ఉంటుంది. చౌటుప్పల్ వద్ద చేపట్టిన పనుల్లో ప్రస్తుతం సర్వీస్ రోడ్ పనులు మాత్రమే పూర్తి చేశారు. చౌటుప్పల్ నుంచి వలిగొండ, భువనగిరికి వెళ్లే మార్గాల్లో అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సి ఉండగా.. అక్కడ ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు. 

దీంతో చౌటుప్పల్ పరిధిలో మాములు టైమ్​లో 15 నిమిషాలు ట్రాఫిక్ జామ్ అవుతుండగా వీకెండ్ టైమ్​లో 30 నిమిషాల నుంచి గంట సమయం పడుతున్నది. ఇక పెద్ద కాపర్తి, చిట్యాలలో మాత్రం వీకెండ్ టైమ్​లో వాహనాల రద్దీని బట్టి గంట నుంచి 3గంటల వరకు వెహికల్స్ ట్రాఫిక్ జామ్​లో ఇరుక్కుపోతున్నాయి.
    

  • చౌటుప్పల్ నుంచి నారాయణపురం వెళ్లే మార్గంలో అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉండగా.. ఇక్కడ కూడా పనులు ప్రారంభించలేదు. దీంతో వాహనాలు నారాయణపురం వెళ్లే టైమ్​లో విజయవాడ నుంచి వచ్చే వాహనాలను రోడ్డుపై నిలపాల్సి వస్తుండడంతో ట్రాఫిక్ జామ్ సమస్య తీవ్రంగా ఉంది.
  • పెద్ద కాపర్తి వద్ద చేపట్టిన ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులతో వాహనాలను సర్వీస్ రోడ్ వైపు మళ్లిస్తున్నారు. సర్వీస్ రోడ్డు మీద ఒక్క వెహికల్ వెళ్లే చాన్స్ ఉండడంతో వేలాదిగా వచ్చే వాహనాలు బ్రిడ్జి దాటేందుకు గంటల తరబడి ట్రాఫిక్ జామ్​లో ఇరుక్కుపోతున్నాయి. ఇక్కడ ఆల్టర్​నేట్ రోడ్ లేకపోవడంతో వెహికల్స్​ ట్రాఫిక్‌‌లో ఆగిపోతున్నాయి.    
  • చిట్యాల టౌన్ లో అండర్ పాస్ బ్రిడ్జి పనులు చేపట్టగా పక్కన సర్వీస్ రోడ్ నుంచి వెహికల్స్ వెళ్లాల్సి ఉండడంతో టౌన్​లో రాంగ్ రూట్​లో వెహికల్స్​ వస్తుండడంతో  అర కిలోమీటర్ దూరం వెళ్లేందుకు అర గంటకు పైగా ట్రాఫిక్ జామ్ అవుతున్నది.    
  • సూర్యాపేట–టేకుమట్ల వద్ద నిర్మిస్తున్న అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టి ఏడాది కావస్తున్నా ముందుకు సాగడం లేదు. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు రాయినిగూడెం వద్ద యూ టర్న్ తీసుకొని వెళ్లాల్సి ఉండగా.. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి.

ట్రాఫిక్ జామ్​తో నరకం చూస్తున్నం

చిట్యాల పట్టణంలో చేపట్టిన ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ప్రారంభించి ఏడాది గడిచింది. అయినా, ఇప్పటికీ ఇంకా 25 శాతం పనులు కూడా పూర్తిచేయలేదు. దీంతో రోజు రోజుకీ ట్రాఫిక్​ సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు రవాణా కష్టాల నుంచి విముక్తి కలిగించాలి. 
– కోనూరు సంజయ్ దాస్, 
చిట్యాల, నల్గొండ జిల్లా

సంక్రాంతి పండుగకి ఎట్ల పోతరు?

సంక్రాంతి పండుగకోసం ఆంధ్రకు వెళ్లే వాళ్లు ఈ రూట్​లోనే పోతరు. అప్పుడు రోజుకు లక్షకు పైగా వెహికల్స్ పాస్ అవుతుంటాయి. ఇప్పుడే ఇట్ల ఉంటే.. పండుగ టైమ్​లో పరిస్థితి ఏందీ? వృద్ధులు, పిల్లలతో  ప్రయాణించే వాళ్లు ట్రాఫిక్ జామ్​తో నరకం చూడాల్సి ఉంటది. 
– వేణు, సూర్యాపేట టౌన్​