ఓట్ల కోసం వచ్చేటోళ్లు చేసేది సేవ కాదు : మోహన్ భాగవత్‌‌‌‌‌‌‌‌

 ఓట్ల కోసం వచ్చేటోళ్లు చేసేది సేవ కాదు : మోహన్ భాగవత్‌‌‌‌‌‌‌‌
  • ఐదేండ్లకోసారి వచ్చే లీడర్లది స్వార్థమే: మోహన్​ భాగవత్‌‌‌‌‌‌‌‌
  • ప్రతిఫలం ఆశించకుండా చేసేదే నిజమైన సేవ అని వ్యాఖ్య  
  • ‘విశ్వ సంఘ్ శిబిర్’ ముగింపు సభలో ఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌​ చీఫ్ ప్రసంగం  

హైదరాబాద్, వెలుగు: ఓట్లకోసం వచ్చేటోళ్లు చేసేది నిజమైన సేవకాదని రాష్ట్రీయ స్వయం సేవక్‌‌‌‌‌‌‌‌ సంఘ్‌‌‌‌‌‌‌‌ (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ఎస్‌‌‌‌‌‌‌‌) చీఫ్‌‌‌‌‌‌‌‌ మోహన్​ భాగవత్‌‌‌‌‌‌‌‌ అన్నారు. ఐదేండ్లకోసారి వచ్చే లీడర్లది స్వార్థమేనని పేర్కొన్నారు. హైదరాబాద్ శివారులోని కన్హా శాంతివనంలో శ్రీ విశ్వనికేతన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5 రోజులపాటు నిర్వహించిన  ‘7వ విశ్వ సంఘ్ శిబిర్’  ముగింపు ఉత్సవం ఆదివారం జరిగింది. దీనికి 79 దేశాల నుంచి వచ్చిన 1,610 మంది ప్రతినిధులనుద్దేశించి  మోహన్ భాగవత్‌‌‌‌‌‌‌‌ మాట్లాడారు. ‘‘ఐదేండ్లకోసారి వరదలా వచ్చి, ఇంటింటికీ  తిరుగుతూ దండాలు పెట్టి సేవ చేసేందుకు అవకాశం కల్పించాలని అడుగుతారు. ఆ తర్వాత ఐదేండ్ల దాకా కనిపించరు. అది ప్రతిఫలాపేక్ష అంటారు. పేరు కోసమో, భయం కోసమో కాకుండా.. నిస్వార్థంగా, ప్రతిఫలం ఆశించకుండా చేసేదే నిజమైన సేవ. 

స్వయంసేవకులు చేసేది అదే” అని తెలిపారు.  సమాజంలో సమస్యలపై చర్చలు అందరూ చేస్తారని, కానీ పరిష్కారం చూపెట్టేటోళ్లే అసలైన లీడర్లని ఆయన అన్నారు. ‘‘పిల్లి మెడలో గంట కట్టాలని ఎలుకలు అనుకుంటాయి.. కానీ కట్టేదెవరు? అనేదే అసలు ప్రశ్న. ఆ పనిని స్వయంసేవకులు తమ భుజాలపై వేసుకుంటారు. డాక్టర్ హెడ్గేవార్ కూడా పనులు తమ నుంచే మొదలుకావాలని భావించి సంఘాన్ని స్థాపించారు’’ అని వివరించారు.  

ధర్మం తప్పడం వల్లే ప్రపంచంలో అశాంతి

ప్రపంచానికి భారత్ మిలిటరీ పవర్ ద్వారానో, ఆర్థిక ఆధిపత్యం ద్వారానో లీడర్ కాదని, కేవలం తన జీవన విధానం ద్వారానే నాయకత్వం వహిస్తున్నదని భాగవత్‌‌‌‌‌‌‌‌ అన్నారు. ధర్మం తప్పడం వల్లే ప్రపంచంలో అశాంతి, అతివాదం పెరిగిపోయిందని, కరుణ లోపించిందని తెలిపారు. విదేశాల్లో పుట్టి పెరిగిన వారు కూడా క్రమం తప్పకుండా శాఖలకు వెళ్తుండటం సంతోషకరమని చెప్పారు.  భారత్ విశ్వగురు కావడం తమ లక్ష్యం కాదని, భారత్ విశ్వగురు కావడం ఈ లోకానికే అవసరమని పేర్కొన్నారు.  సైన్స్ అంటేనే ప్రశ్నించడమని భారత్ బయోటిక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా అన్నారు.  ఈ సమావేశంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్..రాంచందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.