- వాటితోనే హెచ్సిటీ, ఎస్ఎన్డీపీ పనులు
- జీహెచ్ఎంసీ బడ్జెట్లో రూ.2,270 కోట్లు కేటాయింపు
హైదరాబాద్ సిటీ, వెలుగు: 2026–27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.3,100 కోట్లు వస్తాయని జీహెచ్ఎంసీ అంచనా వేస్తోంది. దీంతోపాటు రూ.800 కోట్ల అప్పులను కూడా ప్రభుత్వ సెక్యూరిటీ మీద ఇప్పిస్తుందని అనుకుంటోంది. ఈ మేరకు బల్దియా 2026–27 ముసాయిదా బడ్జెట్ లో హెచ్ సిటీ కోసం రూ.1,720 కోట్లు, నాలాల కోసం రూ.550 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పొందుపరించింది.
2025–26 బడ్జెట్లో బల్దియాకు రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో రూ.3వేల కోట్లు కేటాయిస్తుందని అంచనా వేయగా, రూ.2,654 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.1,327 కోట్లు రిలీజ్ చేసింది. ఆర్థిక సంవత్సర ముగింపునకు మరో మూడు నెలల టైం ఉంది. ఆ లోపు మిగతా నిధులు కూడా విడుదలవుతాయన్న ఆశతో జీహెచ్ఎంసీ ఉంది.
అంచనాలకు మించి ఇస్తారనే ఆశ
రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీకి వచ్చే ఆర్థిక సంవత్పరంలో భారీగా నిధులు కేటాయించే చాన్స్ ఉంది. జీహెచ్ఎంసీ విస్తరించిన తర్వాత కేటాయించే తొలి బడ్జెట్ కావడంతో ఎక్కువగానే కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో ఆ లోపు విలీనమైన ప్రాంతాల్లో రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం భారీగా నిధులు ఇస్తారని అధికారులు అనుకుంటున్నారు.
