విద్యారంగాన్ని కాపాడాల్సింది టీచర్లే : మంత్రి సీతక్క

విద్యారంగాన్ని కాపాడాల్సింది టీచర్లే : మంత్రి సీతక్క
  •     మంత్రి సీతక్క

జనగామ అర్బన్, వెలుగు : విద్యే సమాజానికి పునాదని, విద్యారంగాన్ని కాపాడాల్సిన ప్రధాన బాధ్యత టీచర్లదేనని మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం జనగామలో జరిగిన టీఎస్‌ యూటీఏఫ్‌ రాష్ట్ర విద్యా సదస్సులో ఆమె మాట్లాడారు. సమాజ భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర అని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, నాణ్యమైన విద్య అందించడం కోసం టీచర్లు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. 

ప్రైవేట్‌ కంటే ప్రభుత్వ విద్య ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందన్నారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి సీఎంతో మాట్లాడతానని, అసెంబ్లీలో సైతం ప్రస్తావిస్తానని చెప్పారు. ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్‌ బకాయిలు, డీఏ, టీఏల విషయంపై కూడా మాట్లాడుతానని హామీ ఇచ్చారు. 

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మరింత కృషి చేస్తానని, విద్యారంగ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌రావు, నాయకుడు నరహరి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్‌రావు, ఆకుల శ్రీనివాసరావు పాల్గొన్నారు.