మరికల్, వెలుగు: మహిళ నుంచే వ్యవసాయం పుట్టిందని ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. రైతు దినోత్సవం సందర్భంగా ఆదివారం ఓ ప్రైవేట్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని రైతులు, కొత్తగా ఎన్నికైన సర్పంచులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం కార్పొరేట్ల గుప్పిట్లోకి పోకుండా, రైతుల హక్కుల కోసం ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రకృతిని కాపాడేందుకు మొక్కలను నాటాలని కోరారు. రైతులు పడే కష్టాన్ని విద్యార్థులకు ప్రాథమిక దశ నుంచే చెప్పాలని టీచర్లకు సూచించారు. ప్రస్తుతం మానవ సంబంధాలు సన్నగిల్లుతున్నాయని, ఇటీవల చిన్న పిల్లలను చంపుకుంటున్న తల్లిదండ్రులను చూడాల్సి వస్తోందని, ఇలాంటి ఘటనలు బాధాకరమని తెలిపారు. మానవీయ విలువలతో కూడిన విద్యను చిన్నప్పటి నుంచే చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజల సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కొత్తగా ఎన్నికైన సర్పంచులు అంకితభావంతో కృషి చేయాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి, కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ వినీతమ్మ, సర్పంచ్ చెన్నయ్య, కాంగ్రెస్ నాయకులు సూర్యమోహన్‌రెడ్డి, గొల్ల కృష్ణయ్య, వీరన్న పాల్గొన్నారు.
