పాక్​లో పట్టాలు తప్పిన రైలు.. 33 మంది మృతి

పాక్​లో పట్టాలు తప్పిన రైలు.. 33 మంది మృతి
  • 80 మందికి తీవ్ర గాయాలు
  • సింధ్  ప్రావిన్స్​లో ఘటన
  • 10 బోగీలు పట్టాలు తప్పాయని వెల్లడించిన రైల్వే అధికారులు
  • ప్రమాదంపై దర్యాప్తుకు రైల్వే శాఖ ఆదేశం

కరాచీ: పాకిస్తాన్​లో ఓ ఎక్స్​ప్రెస్  రైలు పట్టాలు తప్పడంతో 33 మంది చనిపోయారు. మరో 80 మందికి పైగా  తీవ్రంగా గాయపడ్డారు. సింధ్  ప్రావిన్స్ లోని నవాబ్ షా జిల్లాలో సర్హరీ రైల్వే స్టేషన్  సమీపంలో హజారా ఎక్స్ ప్రెస్  ట్రెయిన్ ప్రమాదానికి గురైంది. ఈ రైలు కరాచీ నుంచి రావల్పిండికి వెళ్తుండగా పట్టాలు తప్పింది. కరాచీకి 275 కిలోమీటర్ల దూరంలో ఈ యాక్సిడెంట్  జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. 

బోగీల్లో ఇరుక్కున్న మృతదేహాలు, గాయపడిన వారిని వెలికితీశారు. బాధితులను అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. పట్టాలు తప్పిన రైలు కంపార్ట్ మెంట్లు తీవ్రంగా డ్యామేజ్  అయ్యాయి. స్థానికులు కూడా రెస్క్యూ ఆపరేషన్ లో పోలీసులకు సహకరించారు. అనంతరం పాకిస్తాన్  ఆర్మీ, రేంజర్లు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అదనపు బలగాలను కూడా రంగంలోకి దింపారు. ఆర్మీ, ఏవియేషన్  హెలికాప్టర్లను రప్పించి బాధితులను ఆస్పత్రులకు ఎయిర్ లిఫ్ట్ చేశారు. కాగా, పది బోగీలు పట్టాలు తప్పాయని రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. ప్రమాదానికి కారణం తెలియరాలేదని, ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని రైల్వే శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. ఆదివారం రాత్రి వరకు 15 డెడ్ బాడీలను వెలికితీశామని చెప్పారు. ఆలస్యంగా బ్రేకులు వేయడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగి ఉండవచ్చని తెలిపారు. ఈ ప్రమాదం తర్వాత కరాచీ– రావల్పిండి మార్గంలో 
పలు రైళ్లను రద్దుచేసినట్లు వివరించారు.

ఆ ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ..

మృతుల కుటుంబాలకు రైల్వే మంత్రి  ఖవాజా సాద్  రఫీక్  సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో వెయ్యి మంది వరకు ప్రయాణిస్తున్నారని ఆయన వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన వారిని సుక్కుర్, నవాబ్ షాలో ఆస్పత్రులకు తరలించామని, ఆ ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ విధించామని తెలిపారు. ప్రమాదానికి మెకానికల్  ఫాల్ట్  కారణం కావొచ్చన్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని విదేశాంగ మంత్రి బిలావల్  భుట్టో అధికారులను ఆదేశించారు. సహాయక చర్యల్లో పాల్గొనాల ని తమ  పార్టీ కార్యకర్తలకు సూచించారు. సింధ్ సీఎం మురాద్  అలీ బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.