ఎస్సీ, ఎస్టీలకు 17% .. బీసీలకు 33%

ఎస్సీ, ఎస్టీలకు 17% ..  బీసీలకు 33%
  • మున్సిపల్​ ఎన్నికల రిజర్వేషన్లు కొలిక్కి..
  • ఓటర్ల గుర్తింపు దాదాపు పూర్తి
  • రెండు మూడు సార్లు క్రాస్ ​చెక్​ చేసిన అధికారులు
  • 2011 జనాభా లెక్కలు, 2019 ఓటర్ల జాబితానే ప్రామాణికం
  • బీసీలకు 40 మున్సిపాలిటీలు,3 కార్పొరేషన్లు

హైదరాబాద్​, వెలుగు:

మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో రిజర్వేషన్ల లెక్క ఓ కొలిక్కి వచ్చింది. బీసీలకు 33 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 17 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి. ఈ మేరకు మున్సిపల్​ అధికారులు రిజర్వేషన్లకు సంబంధించిన ప్రాథమిక వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా మున్సిపాలిటీల్లోని జనాభా, 2019 జనవరి ఒకటి నాటి ఓటర్ల జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్యను లెక్కించి రిజర్వేషన్ల లెక్క తేల్చారు. జనవరి 5న రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు జనవరి ఏడో తేదీన ఎన్నికల నోటిఫికేషన్​ను ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మున్సిపాలిటీల్లో వార్డులు, డివిజన్ల వారీగా ఓటర్ల లెక్కలను అధికారులు దాదాపు పూర్తి చేశారు. ఇప్పటికే రెండు సార్లు వాటిని క్రాస్​ చెక్​ చేశారు. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీల జనాభా 17 శాతానికి మించి లేదని గుర్తించారు. కాబట్టి వాళ్లకు ఇచ్చే రిజర్వేషన్లూ అంతే ఉంటాయని అధికారులు అంటున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల్లో 50 శాతం లోపే రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది.

85 శాతం ఓటర్లు

2011 నాటి జనాభా లెక్కలతో 2019 ఓటర్ల జాబితాను పోలిస్తే మొత్తంగా 85.47 శాతం మంది ఓటర్లున్నట్టు మున్సిపల్​ అధికారులు గుర్తించారు. మామూలుగా అయితే జనాభాలో 65 శాతం మాత్రమే ఓటర్లు ఉంటారని, మిగతా 35 శాతం 18 ఏళ్లలోపు వాళ్లుంటారని అధికారులు చెబుతున్నారు. జనాభా లెక్కింపుకు 2011 సెన్సస్​నే కటాఫ్​ గా తీసుకున్నట్టు చెప్పారు. అప్పటితో పోలిస్తే అర్బన్​ లోకల్​ బాడీస్​లో జనాభా భారీగా పెరిగిందని అంటున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామ పంచాయతీల జనాభానూ మొత్తం జనాభా లెక్కల్లో చేర్చామన్నారు. వాటి ఆధారంగానే ఓటర్ల లెక్కింపు పూర్తి చేసి, ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం సీట్లను కేటాయించబోతున్నామని తెలిపారు.

బీసీలే ఎక్కువ

మున్సిపాలిటీల్లో మిగతా కేటగిరిలతో పోలిస్తే బీసీల జనాభానే ఎక్కువున్నట్టు అధికారుల లెక్కల్లో తేలింది. ఎంతమంది ఉన్నారన్నది మాత్రం అధికారులు చెప్పలేదు. అయితే, 45 శాతం పైగానే బీసీలున్నట్టు తెలుస్తోంది. ఎస్సీ ఓటర్లు 12 శాతం, ఎస్టీలు 5 శాతం వరకున్నట్టు తేలిందని అధికారులు చెబుతున్నారు. ఆ రెండు వర్గాల వారికి ఓటర్ల సంఖ్య ఆధారంగానే రిజర్వేషన్లు ఇస్తామంటున్నారు. బీసీల జనాభా ఎక్కువగానే ఉన్నా, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం లోపే ఉండాలి కాబట్టి 33 శాతం సీట్లు దక్కే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7 శాతం రిజర్వేషన్లు ఉండేవి. మొత్తం రిజర్వేషన్లు 56 శాతం కావడంతో కొందరు కోర్టుకెళ్లారు. దీంతో రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో బీసీ రిజర్వేషన్లకు కోత పెట్టారు. పంచాయతీ ఎన్నికల్లో కేవలం 22.78% మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చారు. ఎస్సీలకు 20.52%, ఎస్టీలకు 6.68% రిజర్వేషన్లు కల్పించారు. అయితే, మున్సిపల్​ ఎన్నికలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీల జనాభా, ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండడంతో బీసీలకు రిజర్వేషన్ల శాతం పెరిగింది. పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే 10 శాతం రిజర్వేషన్లు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే, గత మున్సిపల్​ ఎన్నికలతో పోలిస్తే మాత్రం ఒక శాతం తక్కువేనని అంటున్నారు.

బీసీలకు 40 మున్సిపాలిటీలు

రాష్ట్రంలో మొత్తం 120 మున్సిపాలిటీలుండగా, రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు 40 స్థానాలు దక్కే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంతేగాకుండా 10 కార్పొరేషన్లకు గానూ 3 మేయర్​ పీఠాలు వస్తాయని అంటున్నారు. ఎస్సీలకు 14  మున్సిపల్​ చైర్మన్లు, ఒక మేయర్​, ఎస్టీలకు 6 మున్సిపల్  చైర్మన్​, ఒక మేయర్​ పీఠం దక్కుతాయని అంచనా వేస్తున్నారు. మొత్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి 60 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లు దక్కుతాయని చెబుతున్నారు. అందులో సగం సీట్లు ఆయా వర్గాల మహిళలకు కేటాయిస్తారు. బీసీ రిజర్వేషన్లలోనే బీసీ–ఈ కేటగిరీనీ కలుపుతామని అధికారులు చెబుతున్నారు.

జనవరి 5న రిజర్వేషన్ల ప్రకటన

జనవరి నాలుగో తేదీన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డులు, డివిజన్ల వారీగా ఫైనల్​ ఓటర్​ లిస్టును ప్రకటించనున్నారు. ఆ జాబితా ఆధారంగా జనవరి 5న వార్డుల, డివిజన్ల వారీగానే రిజర్వేషన్లను ప్రకటిస్తారు ఎన్నికల అథారిటీలుగా ఉన్న కమిషనర్లు. జనరల్​, రిజర్వ్​డ్​ కేటగిరీల్లోని సగం స్థానాలను మహిళలకు కేటాయిస్తారు. వివిధ పార్టీల నాయకుల సమక్షంలో వార్డులను డ్రా తీస్తారు. డ్రాలో వచ్చిన వాటినే మహిళలకు కేటాయిస్తారు. అదే రోజు మేయర్లు, మున్సిపల్​ చైర్మన్ల రిజర్వేషన్లను మున్సిపల్​ స్టేట్​ హెడ్​క్వార్టర్స్​లో సీడీఎంఏ, స్టేట్​ ఎలక్షన్​ అధికారి టీకే శ్రీదేవి ప్రకటిస్తారు. సగం మహిళలకు కేటాయించేలా డ్రా తీస్తారు.