ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం 330 చార్జింగ్ సెంటర్లు

ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం 330 చార్జింగ్ సెంటర్లు
  • ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం 330 చార్జింగ్ సెంటర్లు
  • బల్దియా పరిధిలో 230, హెచ్ఎండీఏ పరిధిలో 100 
  • ప్రయోగాత్మకంగా సిటీలో 14  ఏర్పాటు చేయనున్న టీఎస్ రెడ్కో

సికింద్రాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీలో పెరుగుతోన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకంతో పబ్లిక్ చార్జింగ్ పాయింట్లను అందుబాటులోకి తెచ్చేందుకు బల్దియా సిద్ధమైంది. ఇందులో భాగంగా మొదట సిటీలోని పలు ప్రాంతాల్లో పబ్లిక్ చార్జింగ్ సెంటర్లను టీఎస్ రెడ్కో( తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనుంది. పెట్రోల్, డీజిల్ వెహికల్స్ తో పెరుగుతోన్న పొల్యూషన్ నేపథ్యంలో దేశంలో 2030 నాటికి ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ఎక్కువగా వాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి తయారీ కంపెనీలకు ప్రోత్సాహనిస్తున్నాయి.  ఇందుకోసం ఈ–వెహికల్ పాలసీని సైతం రిలీజ్ చేశారు. ఈ పాలసీలో అర్బన్ ఏరియాల్లో పబ్లిక్ చార్జింగ్ పాయింట్ల ఏర్పాట్లకు సంబంధించిన గైడ్ లైన్స్ ను రూపొందించారు.  టీఎస్ రెడ్కో, విద్యుత్ శాఖ, ఎలక్ట్రానిక్ వింగ్ సహకారంతో బల్దియా చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం టీఎస్ రెడ్కోతో బల్దియా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో 230 లోకేషన్లు, హెచ్ఎండీఏ పరిధిలో 100 లోకేషన్ల జాబితాను జీహెచ్ఎంసీ అధికారులు టీఎస్ రెడ్కోకు అందజేశారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ సెంటర్లలో ప్రతి లోకేషన్ లో ఫాస్ట్ స్పీడ్ చార్జింగ్, స్లో స్పీడ్ చార్జింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ పబ్లిక్ చార్జింగ్ సెంటర్లతో వచ్చే ఆదాయాన్ని అంచనా వేసేందుకు ప్రయోగాత్మకంగా మొదట గ్రేటర్ సిటీలో 14 లోకేషన్లలో చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసేందుకు టీఎస్ రెడ్ కో నిర్ణయించింది. చార్జింగ్ సెంటర్ ఏర్పాటైన తర్వాత యూనిట్ కు రూ.1 చొప్పున జీహెచ్ఎంసీకి ప్రతి 3 నెలలకోసారి టీఎస్ రెడ్కో చెల్లించనుంది. ఈ ప్రాసెస్ ను కొనసాగించేందుకు బల్దియాతో టీఎస్ రెడ్కో ఒప్పందం చేసుకోవాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు.

మొదటగా ఈ ప్రాంతాల్లోనే..


ఇందిరా పార్కు , కేబీఆర్ పార్కు గేట్ నం.1, 3, 6, పార్కింగ్ ఏరియా, ట్యాంక్ బండ్ పై ఉన్న వీరేశలింగం విగ్రహం వద్ద, బషీర్​బాగ్, గన్ ఫౌండ్రీలోని మహబూబియా బాలికల జూనియర్ కాలేజీ, అబిడ్స్ లోని మున్సిపల్ పార్కింగ్ ఏరియాలో, నానాక్​రాంగూడలోని బల్దియా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద, వనస్థలిపురం హరిణ వనస్థలి పార్కు వద్ద, ఉప్పల్ శిల్పారామం, ఉప్పల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ ఏరియాలో, సంతోశ్​నగర్ పరిధి ఒవైసీ హాస్పిటల్ వద్ద, బేగంపేటలోని తాజ్ వివంతా హోటల్ దగ్గర.. మొత్తం ఈ 14 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా చార్జింగ్ సెంటర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.