ఎడతెగని వానలు.. స్తంభించిన జనజీవనం

ఎడతెగని వానలు..   స్తంభించిన జనజీవనం

మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు : ఎడతెగని వానలతో ఉమ్మడి మెదక్ జిల్లాలో జనజీవనం స్తంభించింది. బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు గెరువియ్యకుండా వర్షం కురిసింది. మెదక్​ జిల్లాలో సగటున 3.4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా మాసాయపేటలో 6.7 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వనదుర్గా ప్రాజెక్ట్​ పొంగిపొర్లుతుండటంతో ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం మళ్లీ జల దిగ్బంధంలో చిక్కుకుంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.  పలు ప్రాంతాల్లో 50 ఇండ్లు కూలిపోయాయి. కూలే దశలో ఉన్న ఇండ్లను ఖాళీ చేయించేందుకు వచ్చిన ఆఫీసర్లను శివ్వంపేట మండలం సీతారాం తండాలో గ్రామస్తులు నిలదీశారు.

పాత గోడల్లో ఉంటున్నామన్నా ఇన్ని రోజులు ఒక్కరికి కూడా డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లు కేటాయించలేదని, ఇప్పుడు ఇండ్లు ఖాళీ చేసి ఎక్కడ ఉండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్​ మండలం మల్కాపూర్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని స్కూల్​ తండాకు చెందిన దేవసోత్​నవనీతకు పురిటి నొప్పులు వచ్చాయి. గ్రామ సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహించడంతో పంచాయతీ సెక్రటరీ, ఆశా వర్కర్, గ్రామస్తులు కలిసి ఆమెను వాగు దాటించి మెదక్ ఆసుపత్రికి పంపించారు.

ALSO READ :వానలకు కూలిన ఇండ్లు, చెట్లు 

సిద్దిపేటలో.. 

సిద్దిపేట జిల్లాలో 83. 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా హుస్నాబాద్ లో 186.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోహెడ మండలం బస్వాపూర్ వద్ద మోయతుమ్మెద వాగు పొంగి పొర్లడంతో సిద్దిపేట-హనుమకొండ, చేర్యాల మండలం వీరన్నపేట వద్ద కల్వర్టు కొట్టుకుపోవడంతో సిద్దిపేట-–జనగామ, నంగునూరు మండలంలో పెద్దవాగు, కూడవెళ్లి, మోయ తుమ్మెద, హల్దీ వాగులు పారడంతో గ్రామాలలో రాకపోకలు నిలిచిపోయాయి. హుస్నాబాద్ లో ఇండ్లలోకి నీరు చేరగా, ప్రధాన రోడ్డు చెరువుగా తలపించింది. సిద్దిపేట పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద లింగం అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మోరీలో పడి వరద నీటిలో కొట్టుకుపోతుండగా స్థానికులు రక్షించారు. జిల్లా వ్యాప్తంగా 260 ఇండ్లు కూలిపోయాయి. 660 చెరువులు వంద శాతం నిండాయి. చేర్యాల మండలం తాడూరులో గిరకపోచయ్య (69) మృతి చెందగా దహనసంస్కారానికి ఇబ్బంది కలిగింది. తాడూరు వాగు అవతలి వైపు వైకుంఠధామం ఉండగా, వాగు పొంగిపొర్లడంతో శవాన్ని తీసుకు వెళ్లిలేని పరిస్థితి నెలకొది. దీంతో బంధువులు ట్రాక్టర్ ద్వారా 10 కిలోమీటర్లు తిరిగి ఊరు పక్కనే ఉన్న శ్మశానవాటికలో అంతక్రియలు పూర్తి చేశారు. 

సంగారెడ్డిలో... 

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సగటున 29.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా అమీన్​పూర్ మండలంలో 48.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సింగూర్ ప్రాజెక్టులోకి 25600 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. 29.917 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో గురువారం సాయంత్రానికి 23.206 టీఎంసీల నీరు ఉంది. మంజీరా ప్రాజెక్టు నిండడంతో రెండు గేట్లు ఎత్తారు. నారింజ ప్రాజెక్టు గేట్ల పైనుంచి నీరుపోతోంది. నల్లవాగు ప్రాజెక్ట్  అలుగు పారుతుండగా, అక్కడక్కడలో లెవెల్ వంతెనలు వరదనీటితో మునిగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వివిధ ప్రాంతాల్లో 45 ఇండ్లు కూలిపోయాయి. సుమారు 250 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. --------