
బ్యూటిఫుల్ హీరోయిన్ నివేదా థామస్ (Nivetha Thomas) చాలా గ్యాప్ తర్వాత నటించిన తెలుగు ఫ్యామిలీ సినిమా '35 చిన్న కథ కాదు' (35 Chinna Katha Kaadu). విశ్వదేవ్, ప్రియదర్శి తదితరులు ప్రముఖ పాత్రలు పోషించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణసంస్థలు సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి సంయుక్తంగా నిర్మించారు.
ALSO READ | త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలని నటి పూనం కౌర్ సంచలన ట్వీట్..
సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదల అయిన అచ్చమైన తెలుగు సినిమా కావడంతో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుని విజయం సాధించింది.అంతేకాకుండా పిల్లల చదువుకు సంబంధించిన కథతో ఒక మంచి ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అంతేకాకుండా కమర్షియల్‍గానూ మోస్తరు సక్సెస్ అయింది. ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం..ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ అయినట్టు తెలుస్తోంది.
అయితే, ఈ మూవీ థియేటర్లలో రిలీజైన మూడు వారాలకే.. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కి తీసుకురావటం దాదాపు ఖరారైంది. సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా సెప్టెంబర్ 27న స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్‍పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
కథేంటంటే:
తిరుపతిలో ప్రసాద్(విశ్వదేవ్) ఒక ఆర్టీసీ కండక్టర్.వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ప్రసాద్ తన సొంత మరదలు అయిన 'చిన్ను' సరస్వతి (నివేదా థామస్)ని పెళ్లి చేసుకుని అరుణ్, వరుణ్ అనే ఇద్దరు పిల్లలకు తండ్రి అవుతాడు. ఈ ముగ్గురే ప్రపంచంగా బతుకుతుంటారు. చిన్నోడు చదువులో పర్వాలేదు కానీ, పెద్దోడు అరుణ్‌కి మాత్రం లెక్కల పాఠాలు ఓ పట్టాన అర్థం కావు.
అంతేకాకుండా అరుణ్ కి చిన్నప్పట్నుంచి లెక్కల్లో బోలెడు డౌట్స్ ఉంటాయి. అసలు సున్నా గురించి ఇంకా చాలా డౌట్స్. అతని డౌట్స్ ఎవరూ తీర్చకపోవడంతో లెక్కల సబ్జెక్టు అంటేనే నచ్చదు. సున్నాకి ఏమీ విలువ లేనప్పుడు దానిపక్కన ఒకటి వచ్చి నిలబడితే పది ఎందుకవుతుందంటూ ఫండమెంటల్స్‌నే ప్రశ్నిస్తాడు. కొత్తగా వచ్చిన గణితం మాస్టారు చాణక్య(ప్రియదర్శి)తో పాటు ఏ ఉపాధ్యాయుడు తన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకకోవడంతో సున్నా మార్కులు తెచ్చుకుంటాడు. దీంతో అరుణ్‌కి జీరో అని పేరు పెట్టి చివరి బెంచీకి పంపిస్తాడు. ఆరోతరగతిలో ఫెయిల్ కూడా చేస్తాడు. దీంతో తన తమ్ముడి క్లాస్‌లో కూర్చోవాల్సి వస్తుంది.
ఈసారి అరుణ్ స్కూల్‌లో ఉండాలంటే లెక్కల్లో కనీసం 35 మార్కులు సాధించాల్సిందే. ఆ పరిస్థితుల్లో జీరో అరుణ్.. క్లాస్‌లో హీరో ఎలా అయ్యాడు? తన కొడుక్కి లెక్కల పాఠాలు అర్థం కావాలని టెన్త్ ఫెయిల్ అయిన తల్లి సరస్వతి ఏం చేసింది? చాణక్య రాకతో అరుణ్ జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి? అరుణ్ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అరుణ్‌ను స్కూల్ నుంచి ఎందుకు సస్పెండ్ చేస్తారు? అరుణ్‌కు లెక్కల్లో ఉండే ఆ ప్రశ్నలు, అనుమానాల్ని తల్లి ఎలా నివృత్తి చేసి కనీసం 35 మార్కులు తెచ్చుకునేలా ఎలా ప్రిపేర్ చేయించింది? అనేది మిగతా కథ.