3.5 లక్షల వ్యాక్సిన్‌‌ డోసులు వెనక్కి

3.5 లక్షల వ్యాక్సిన్‌‌ డోసులు వెనక్కి

వచ్చే నెలలో ఎక్స్‌‌పైరీ అవుతున్నందునే వెనక్కి పంపామన్న హెల్త్‌‌ ఆఫీసర్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే నెలలో ఎక్స్‌‌పైరీ అవనున్న 3.5 లక్షల వ్యాక్సిన్లను వెనక్కి పంపించినట్లు హెల్త్‌‌ ఆఫీసర్‌‌‌‌ ఒకరు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్లు వేయించుకునే వారి సంఖ్య తక్కువగా, వ్యాక్సిన్ల నిల్వ సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. దీంతో వ్యాక్సిన్లు ఎక్స్‌‌పైరీకి దగ్గర పడ్డాయని, అందువల్లే వాటిని వెనక్కి పంపించామని చెప్పారు. అయితే, వాటిని వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు పంపించారా..? లేదంటే గోడౌన్లకు పంపించారా..? అనే విషయంలో క్లారిటీ లేదు. అందరికీ బూస్టర్ వేయడానికి పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నా కేంద్రం ఇవ్వకపోవడం, వ్యాక్సిన్లు మాత్రం అడిగిన దాని కంటే ఎక్కువగా పంపించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇంకా 30 లక్షల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

496 మందికి కరోనా

రాష్ట్రంలో మరో 496 మందికి కరోనా సోకింది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం 28,808 మందికి టెస్టులు చేస్తే, హైదరాబాద్‌‌లో 341 మందికి, రంగారెడ్డి జిల్లాలో 68 మందికి , మేడ్చల్‌‌లో 40 మందికి, సంగారెడ్డిలో 15 మందికి పాజిటివ్‌‌ వచ్చిందని హెల్త్ డిపార్ట్‌‌మెంట్ ప్రకటించింది. మిగిలిన అన్ని జిల్లాల్లో కలిపి 32 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,613కు పెరిగింది.