తెలంగాణపై పిడుగు పోటు .. నెలన్నరలోనే 35 మంది మృతి

తెలంగాణపై పిడుగు పోటు .. నెలన్నరలోనే 35 మంది మృతి
  • ఈ నెల 6న ఒక్కరోజే ప్రాణాలు కోల్పోయిన 9 మంది 
  • పిడుగుల అలర్ట్స్ పై అవగాహన లేక బలవుతున్న జనం
  • వర్షం వస్తే చెట్ల కిందకు పరుగులు
  • చెట్ల కిందకు, ఎత్తైన భవనాల పైకి వెళ్లకూడదంటున్న సైంటిస్టులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పిడుగుల ప్రభావంతో జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు. మే రెండో వారం నుంచి ఇప్పటి వరకు 35 మంది వరకు పిడుగుపాటుకు గురై చనిపోయారు. పిడుగుల అలర్ట్స్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అవగాహన లేకపోవడం వంటి కారణాలతో పిడుగులకు బలవుతున్నారు. ఈ నెల 6న ఒక్కరోజే వివిధ జిల్లాల్లో పిడుగుపాటుకు గురై 9 మంది చనిపోయారు.

అలాగే గత నెల మే 12న ఆదిలాబాద్​ జిల్లాలో ముగ్గురు, అదే నెల 19న వికారాబాద్​ జిల్లాలో ముగ్గురు, ఈ నెల 5న మెదక్​లో ఇద్దరు, 7న సిరిసిల్లలో మరో ఇద్దరు మృతి చెందారు. ఇలా మరికొన్ని ప్రాంతాల్లో కూడా పిడుగుల పడి కొందరు చనిపోయారు. ఇవన్నీ మీడియా ద్వారా బయటకు వస్తున్న లెక్కలే. అధికారికంగా వెల్లడికాని మృతులూ మరి కొంతమంది ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నుంచి పిడుగులకు సంబంధించిన అలర్ట్స్​ వస్తున్నా పలు సందర్భాల్లో అవి జనానికి చేరడం లేదు. 

ఎత్తైన ప్రాంతాల్లోనూ ఉండొద్దు

నిర్మాణంలో ఉన్న బిల్డింగుల్లో కూడా వర్షం పడేటప్పుడు పిడుగులు పడే ప్రమాదం ఉందని ఐఎండీ సైంటిస్టు శ్రావణి తెలిపారు. పిడుగులు రెండు రకాలని ఆమె చెప్పారు. ‘‘ఆకాశంలో మేఘాల మధ్య రియాక్షన్​ జరిగి అక్కడే డైల్యూట్​ అయిపోయే పిడుగులు ఒక రకమైతే.. మేఘాల నుంచి నేలను తాకే పిడుగులు రెండో రకం. ఈ రెండో రకం పిడుగుల వల్లే ఎక్కువగా జనాలు చనిపోతుంటారు.

అయితే, మేఘాల మధ్య జరిగే ఎలక్ట్రిక్​ రియాక్షన్​ పిడుగులా భూమిని చేరేందుకు ఎత్తైన వస్తువులు ఆకర్షిస్తాయి. ముఖ్యంగా చెట్ల ద్వారానే పిడుగులు నేలను చేరుతాయి. దానికి కారణం చెట్లలోని హరిత పదార్థం (గ్రీన్​ కలర్) పాజిటివ్​ ఎనర్జీని త్వరగా ఆకర్షిస్తుంది. అందుకే ఎక్కువగా చెట్లపైనే పిడుగులు పడుతుంటాయి” అని శ్రావణి వివరించారు. సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యే పిడుగులు ఎక్కువ పడతాయని ఆమె పేర్కొన్నారు. ఎత్తైన నిర్మాణం పూర్తికాని భవనాలు, నిర్మాణంలో ఉన్న భవనాలపైనా పిడుగులు పడేందుకు చాన్సెస్​ ఎక్కువగా ఉంటాయన్నారు. ఇక పిడుగులపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని, అవగాహన కల్పిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. 

మరో రెండు రోజులు భారీ వర్షాలు

రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, వికారాబాద్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. అత్యధికంగా వికారాబాద్​ జిల్లాలో 6.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే జిల్లా తాండూరులో 4.2, పెద్దేముల్​లో 3.6, నారాయణపేట జిల్లా చిన్నజాత్రంలో 3.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మిగతా ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది. కాగా, రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు పడుతాయని పేర్కొంది. మరోవైపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ టెంపరేచర్లు  తగ్గుముఖం పట్టాయి. ఆదిలాబాద్​లో అత్యధికంగా 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాల్లో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.​ అత్యల్పంగా వికారాబాద్​ జిల్లా మోమిన్​పేటలో 34.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నారాయణపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్​నగర్, వనపర్తి, నాగర్​కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లోనూ సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

చెట్ల కింద అస్సలు ఉండవద్దు

వర్షాకాలంలో చాలా మంది పొలం పనులు చేసుకునో లేదంటే ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్తారు. ఆ సమయంలో వర్షం పడితే చెట్ల కిందకు వెళ్లి నిలబడుతుంటారు. వర్షాకాలంలో చెట్లపైనే పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబ్టటి.. చెట్ల కిందకు వెళ్లడం అస్సలు మంచిది కాదని వాతావరణ శాఖ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. వీలైనంత వరకు క్లోజ్డ్​ డోర్స్​ ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లాలని, తడిసినా వీలైతే ఓపెన్​ ప్లేస్​లోనే నిలబడడం మంచిదని సూచించారు. చెట్ల దగ్గర ఉండడమూ ప్రమాదకరమే అని తెలిపారు.