గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్..36 కిలోల గాంజా స్వాధీనం

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్..36 కిలోల గాంజా స్వాధీనం

ఖిలా వరంగల్(మామునూరు), వెలుగు: వరంగల్ నగరంలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద 36 కిలోల 878 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్స్ డీఎస్పీ రమేశ్​కుమార్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. 

ఒడిశా నుంచి కరీంనగర్ వైపు గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్సై కుమారస్వామి ఆధ్వర్యంలో ఖమ్మం ఫ్లైఓవర్ వద్ద తనిఖీలు నిర్వహించారు. బైక్‌‌‌‌పై ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా పట్టుకోగా రెండు బ్యాగుల్లో గంజాయి లభ్యమైంది. 

నిందితులను బుచల ఆదిత్య అలియాస్ ఇంద్ర(20), గొల్లపల్లి నిఖిల్ అలియాస్ చింటు(19)గా గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.18,43,900గా ఉంటుందని తెలిపారు. తక్కువ ధరకు కొనుగోలు చేసి తెలంగాణలో విక్రయించేందుకు తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో నార్కోటిక్ ఇన్‌‌‌‌స్పెక్టర్ రవీందర్, ఎస్సై కుమారస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.