- వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ కేర్
- రాష్ట్రవ్యాప్తంగా 37 మల్టీ సర్వీస్ డే కేర్ కేంద్రాలు
- ఒంటరితనం పోగొట్టి.. ఉల్లాసాన్ని పంచేలా ప్లాన్
- నేడు ప్రజాభవన్ వేదికగా ప్రారంభించనున్న సీఎం రేవంత్
హైదరాబాద్, వెలుగు: ఒంటరితనంతో కుమిలిపోతున్న సీనియర్ సిటిజన్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కన్నబిడ్డలు ఉద్యోగాలతో బిజీగా మారిపోవడం, మనుమళ్లు స్కూళ్లకు వెళ్లడంతో ఇంట్లో దిక్కుతోచకుండా ఉంటున్న పెద్దలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. వారి ఆలనాపాలనా చూసుకునేందుకు, మానసిక ఉల్లాసాన్ని పంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రణామ్’ పేరుతో 37 మల్టీసర్వీస్ డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రజాభవన్ వేదికగా వర్చువల్ గా ప్రారంభించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, హనుమకొండ జిల్లాల్లో రెండేసి, మిగతా 29 జిల్లాల్లో ఒక్కో డే కేర్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా హాస్పిటల్స్ లోని జెరియాట్రిక్ క్లినిక్ లతో ఈ సెంటర్లను లింక్ చేసి హెల్త్ చెకప్ లు కూడా చేయిస్తారు. వృద్ధుల హెల్త్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసేలా డాక్టర్లు, ఫిజియోథెరపీ సేవలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా యోగా, మెడిటేషన్ చేయిస్తారు. దేశంలోనే ప్రభుత్వం ఇలాంటి డే కేర్ సెంటర్లు నడపడం ఇదే ఫస్ట్ టైం. ఇవాళ 18 సెంటర్లను సీఎం వర్చువల్ గా ప్రారంభిస్తారు.
పొద్దున పోతే.. సాయంత్రం దాకా
ఆదివారం, ప్రభుత్వ సెలవులు మినహా మిగతా రోజుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు డే కేర్ సెంటర్లు నడుస్తాయి. టైంపాస్ కోసం టీవీ, కంప్యూటర్, ఇంటర్నెట్, చిన్న లైబ్రరీ, ఇండోర్ గేమ్స్ ఈ కేంద్రాల్లో ఉంటాయి. మధ్యాహ్నం వేడివేడి భోజనంతో పాటు స్నాక్స్ కూడా అందిస్తారు. సేద తీరేందుకు గార్డెనింగ్, మొక్కల పెంపకం లాంటివి ఏర్పాటు చేయనున్నారు. 60 ఏళ్లు పైబడిన వారు ఈ సెంటర్లలో రిజిస్టర్ చేసుకుని సేవలు పొందవచ్చు.
చిన్నారుల కోసం బాల భరోసా
పుట్టుకతో వచ్చే లోపాలు, ఎదుగుదల సమస్యలను త్వరగా గుర్తించి చికిత్స అందించేందుకు ప్రభుత్వం బాల భరోసా స్కీమ్ తేనుంది. 0 నుంచి 5 ఏండ్ల పిల్లలను అంగన్వాడీ టీచర్లు స్క్రీనింగ్ చేస్తారు. ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు అనుమానం వస్తే వెంటనే ఆర్బీఎస్కే, పీహెచ్‌సీ డాక్టర్లకు రెఫర్ చేస్తారు. డాక్టర్ల పరీక్షల తర్వాత అవసరమైన చిన్నారులకు ఉచితంగా సర్జరీలు, థెరపీలు, రిహాబిలిటేషన్ సేవలు అందిస్తారు. ఈ స్కీమ్ ను కూడా సీఎం రేవంత్ రెడ్డి సోమవారం అధికారికంగా ప్రారంభించనున్నారు.
దివ్యాంగులకు రూ.50 కోట్ల పరికరాలు
దివ్యాంగులు ఎవరి మీదా ఆధారపడకుండా బతికేందుకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఇందుకోసం స్పెషల్ గా రూ.50 కోట్లు మంజూరు చేసింది. రూ.43.22 కోట్ల విలువైన పరికరాలను 7 వేల మందికి పంపిణీ చేయనున్నారు. ఇవాళ సీఎం చేతుల మీదుగా 200 మంది లబ్ధిదారులకు ఈ పరికరాలను అందజేస్తారు. మిగతావారికి జిల్లాల్లో మంత్రులు, కలెక్టర్ల ఆధ్వర్యంలో పంపిణీ చేస్తారు. రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వెహికల్స్ (స్కూటీలు), బ్యాటరీ ట్రై సైకిళ్లు, బ్యాటరీ వీల్ చైర్లు, ల్యాప్ టాప్ లు, హియరింగ్ ఎయిడ్స్, 4జీ స్మార్ట్ ఫోన్లను దివ్యాంగులకు ఉచితంగా పంపిణీ చేస్తారు.
