ఫ్యూచర్ సిటీ: అధిక వడ్డీ, భారీ లాభాల ఆశ చూపిస్తూ చిట్టీల పేరుతో పలువురు బాధితులను మోసం చేసిన ఘటన శంకర్పల్లిలో వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో మొత్తం 48 మంది బాధితుల నుంచి సుమారు రూ.3.62 కోట్ల వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అయితే బాధితుల ఫిర్యాదుల ప్రకారం మొత్తం మోసం రూ.4 కోట్లకు పైగా ఉండవచ్చని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. శంకర్పల్లి ప్రాంతంలో 2021 నుంచి 2024 వరకు నిందితుడు చిట్టీల పేరుతో డబ్బుల వసూళ్ల వ్యవహారం కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నెలకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు చెల్లించేలా బాధితులను నమ్మించి వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. చిట్టీల ద్వారా అధిక వడ్డీతో పాటు భారీ లాభాలు వస్తాయని ఆశ చూపడంతో పలువురు డబ్బులు పెట్టుబడిగా పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ వసూళ్ల వ్యవహారంలో నిందితుడి భార్య లక్ష్మితో పాటు మరికొందరు సహకరించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. మొదట్లో చిట్టీల వ్యవహారం సజావుగా సాగినప్పటికీ, క్రమంగా చెల్లింపుల్లో జాప్యం జరిగినట్లు సమాచారం. చివరకు 2024 జూన్లో బాధితులకు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకుండా నిందితుడు అదృశ్యమైనట్లు ఫిర్యాదులో తెలిపారు.
