జమ్మూ కాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. వరదకు కొట్టుకుపోయిన ఇండ్లు.. నలుగురు మృతి

జమ్మూ కాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. వరదకు కొట్టుకుపోయిన ఇండ్లు.. నలుగురు మృతి

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‎లో క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. మేఘాలవిస్పోటనం వల్ల మంగళవారం (ఆగస్ట్ 26) దోడా గ్రామాన్ని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వరద ఉధృతికి15 ఇండ్లు, అనేక గోశాలలు తుడిచిపెట్టుకుపోయాయి. ఒక ప్రైవేట్ ఆరోగ్య కేంద్రం కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. మూడు ఫుట్‌బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. భారీ వరదల నలుగురు మరణించారు. మరికొందరు వరదలో గల్లంతయ్యారు. దోడా గ్రామాన్ని వరద నీరు చుట్టిముట్టడంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహయక చర్యలు చేపట్టాయి. ఆర్మీ కూడా రంగంలోకి దిగి రెస్య్కూ ఆపరేషన్ చేపట్టింది. 

దోడాతో పాటు కథువా, సాంబా, జమ్మూ, రాంబన్, కిష్త్వార్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం దృష్ట్యా జమ్మూ డివిజన్ అంతటా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు అధికారులు. కొండచరియలు, రాళ్ళు విరిగిపడటంతో ముందు జాగ్రత్త చర్యగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని క్లోజ్ చేశారు. దీంతో జమ్మూ-శ్రీనగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తావి నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పాటు అనేక నదులు, వాగులలో నీటి మట్టం ఇప్పటికే ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి.

ఇవాళ రాత్రి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ప్రజలు నదులు, చెరువులు, కుంటలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు అధికారులు. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 

వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మురంగా సహయక చర్యలు చేపడుతున్నారు. ప్రజలు బయటకు రావొద్దని.. అత్యవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని హెచ్చరించారు. ప్రకృతి అందాలకు నిలయమైన జమ్మూ కాశ్మీర్ భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోతున్న నేపథ్యంలో పర్యాటకులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.