చాలా మందికి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కొనటంలో గందరగోళం ఎదుర్కొంటుంటారు. కొన్ని ఉత్పత్తుల్లో ఉండే భద్రత రాబడికి సంబంధించిన వివరాలు కంపేర్ చేసుకోవటం.. సరైన పాలసీని ఎంచుకోవటం ఇబ్బందికి ఫీలవుతూ ఉంటారు. అయితే ఇన్సూరెన్స్ అనేది కుటుంబ భవిష్యత్తు కోసం తీసుకునే ఒక ముఖ్యమైన ఆర్థిక నిర్ణయం. అందుకే సరైన అవగాహనతో టర్మ్ ప్లాన్ కొనుగోలు కోసం 4 గోల్డెన్ రూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. మీపై ఆధారపడిన వారు ఉంటేనే ఇన్సూరెన్స్ కంపల్సరీ..
లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కేవలం ఆదాయపు పన్ను ఆదా చేసే సాధనం కాదు. దాని ప్రధాన ఉద్దేశం మీపై ఆధారపడిన వారికి ఆర్థిక భద్రత కల్పించడటమే. ఆర్థికంగా ఆధారపడిన వారు లేనివారు జీవిత బీమా కొనకూడదు. అలాగే పన్ను ఆదా కోసం మాత్రమే ఇన్సూరెన్స్ కొనాలనే ఆలోచన చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఊహించని సంఘటనలు జరిగినప్పుడు కుటుంబ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడడమే దీని అసలు ప్రయోజనం.
2. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లకు ప్రాధాన్యత..
అన్ని లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు ఒకేలా ఉండవు. టర్మ్ ప్లాన్‌లు చాలా సరళమైనవి. ఇవి జీవిత ప్రమాదాన్ని మాత్రమే కవర్ చేస్తాయి. పాలసీదారు పాలసీ వ్యవధిలో మరణిస్తే, నామినీకి బీమా మొత్తాన్ని చెల్లిస్తారు. పాలసీదారు జీవించి ఉంటే ఎలాంటి డబ్బు చెల్లించబడదు. ఈ ప్లాన్‌లు తక్కువ ఖర్చుతో సులభంగా అర్థం చేసుకోగలిగేవి కావటం ఉద్యోగులకు ప్రయోజనకరం.
3. ఇన్సూరెన్స్ కవర్ మొత్తం..
కావలసిన కవరేజీ మొత్తాన్ని తక్కువగా అంచనా వేయడం ఒక సాధారణ పొరపాటు. మీరు లేని సమయంలో ఆదాయాన్ని భర్తీ చేయడానికి, కుటుంబ దీర్ఘకాలిక అవసరాలను తీర్చడానికి తగినంత ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. పాలసీదారు తన వార్షిక ఆదాయానికి 12-15 రెట్లు సమానమైన లైఫ్ ఇన్సూరెన్స్ తప్పక కొనాలి. యుక్త వయస్సులో ఉన్న వ్యక్తులైతే కనీసం 15 రెట్లు కవరేజ్ ఆదాయంపై తీసుకోవటం మంచిది.
ALSO READ : LIC కొత్త పాలసీ స్కీమ్స్..
4. ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రెండిటినీ కలపొద్దు..
రాబడిని వాగ్దానం చేసే అనేక పెట్టుబడి-అనుసంధానిత బీమా ప్లాన్‌లు(ULIP వంటివి) తరచుగా తగినంత కవరేజీని లేదా అర్థవంతమైన పెట్టుబడి వృద్ధిని అందించడంలో విఫలమవుతాయి. దీనివల్ల ఇన్వెస్ట్మెంట్ అలాగే ఇన్సూరెన్స్ రెండు ప్రయోజనాలూ సరిగ్గా నెరవేరవని గుర్తుంచుకోండి. అందుకే ఈ రెండింటినీ వేరువేరుగానే చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వలన టర్మ్ ప్లాన్‌తో పోలిస్తే ఇన్సూరెన్స్ మొత్తం తక్కువగా లభిస్తుంది. అలాగే అనేక ఖర్చుల కారణంగా రాబడి కూడా తక్కువగా ఉంటుంది. అందుకే రక్షణ కోసం టర్మ్ ప్లాన్స్, దీర్ఘకాలిక సంపద సృష్టి కోసం మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్ లేదా ఈటీఎఫ్‌లు వంటివి ఎంచుకోవటం మంచిది. ఇవి కవరేజీకి అదనపు బలాన్ని చేకూర్చుతాయి పాలసీదారులకు.
