
హైదరాబాద్, వెలుగు: ఆర్బీఐ బ్యాన్ ఎత్తేసిన నెల రోజుల లోపే 4 లక్షల కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేసినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గ్రూప్ పేమెంట్స్ హెడ్ పరాగ్ రావు చెప్పారు. త్వరలోనే పోగొట్టుకున్న మార్కెట్ షేర్‌ను మళ్లీ చేజిక్కించుకుంటామనే ధీమాను వ్యక్తం చేశారు. ఇందుకోసం తమ వ్యూహం మార్చుకున్నామని, పార్టనర్షిప్ల ద్వారా ముందుకు దూసుకెళ్లాలనుకుంటున్నామని కూడా పరాగ్ రావు వెల్లడించారు. మెరుగైన క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తేవడం వల్లే రికార్డు స్థాయిలో 4 లక్షల కార్డులు జారీ చేయగలిగామని పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. టెక్నాలజీ ప్రాబ్లమ్స్‌తో చాలాసార్లు డిజిటల్ బ్యాంకింగ్ ఎఫెక్ట్ అవడం వల్ల కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేయొద్దనే నిబంధనను ఆర్బీఐ కిందటేడాది డిసెంబర్లో విధించిన విషయం తెలిసిందే. ఈ బ్యాన్‌ను ఆగస్టు మధ్యలో ఎత్తివేశారు. ఆ తర్వాత పేటీఎంతోనూ హెచ్డీఎఫ్సీ పార్టనర్‌షిప్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. కస్టమర్ల కోసం కొత్తగా మూడు కార్డులను లాంఛ్ చేస్తున్నట్లు కూడా పరాగ్ రావు చెప్పారు. ఫిబ్రవరి 2022 నాటికి నెలకు 5 లక్షల క్రెడిట్ కార్డులు జారీ చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని పేర్కొన్నారు.