నల్గొండ జిల్లాలో ఒకే కుటుంబంలో నలుగురు మిస్సింగ్... ఇంట్లో దొరికిన ‘ఇక సెలవు’ అంటూ రాసి ఉన్న నోట్‌‌‌‌ 

నల్గొండ జిల్లాలో ఒకే కుటుంబంలో నలుగురు మిస్సింగ్... ఇంట్లో దొరికిన ‘ఇక సెలవు’ అంటూ రాసి ఉన్న నోట్‌‌‌‌ 

నల్గొండ, వెలుగు : ఇద్దరు పిల్లలతో కలిసి భార్యాభర్త కనిపించకుండా పోయారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఇంట్లో సూసైడ్‌‌‌‌ నోట్‌‌‌‌ దొరకడంతో స్థానికంగా కలకలం చెలరేగింది. ఈ ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్‌‌‌‌ జిల్లా జగిత్యాలకు చెందిన గిరి శ్రీకాంత్‌‌‌‌, లక్ష్మి భార్యాభర్తలు. 

శ్రీకాంత్‌‌‌‌ జగిత్యాలలో వ్యాపారం చేయగా.. తీవ్రంగా నష్టాలురావడంతో అప్పులపాలయ్యాడు. దీంతో శ్రీకాంత్‌‌‌‌ లక్ష్మి దంపతులు తమ పిల్లలు హర్షిత, సాయిచరణ్‌‌‌‌తో కలిసి నల్గొండకు వచ్చి బీటీఎస్‌‌‌‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. దంపతులు వేర్వేరు కిరాణషాపుల్లో పనిచేస్తుండగా, పిల్లలు బీటెక్‌‌‌‌ చదువుతున్నారు. శనివారం నుంచి బంధువులు ఫోన్‌‌‌‌ చేస్తున్నా స్విచాఫ్‌‌‌‌ అని వస్తుండడంతో వారు ఇంటికి వచ్చి చూశారు. 

ఇంటికి తాళం వేసి ఉండడంతో దానిని పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా.. ‘ఇన్ని రోజులు అండగా నిలబడి ఉన్న ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాం. ఏమైనా ఇబ్బంది పెడితే క్షమించండి.. ఇక సెలవు’ అంటూ రాసిన నోట్‌‌‌‌ కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. నలుగురు కనిపించకుండా పోయి 24 గంటలు దాటిపోవడంతో పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. 

ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి, మొబైల్‌‌‌‌ సిగ్నల్స్‌‌‌‌ ఆధారంగా లొకేషన్‌‌‌‌ను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పట్టణంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి.. నలుగురు ఖమ్మం బస్సు ఎక్కినట్లు గుర్తించారు. ఖమ్మంలో ఎవరైనా బంధువులు ఉన్నారా ? లేక మరెక్కడికైనా వెళ్లారా ? అనే వివరాలు సేకరిస్తున్నారు.