
- కామారెడ్డి జిల్లాలో 4 ప్రైమరీ స్కూల్స్ తిరిగి ప్రారంభం
- గతంలో జీరో ఎన్రోల్తో మూత
- పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడంతో రీఓపెన్
కామారెడ్డి, వెలుగు : జీరో ఎన్‌రోల్‌మెంట్‌తో గతంలో మూతపడిన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్న ఏరియాల్లో బడులను తెరువాలని విద్యా శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి జిల్లాలో గతంలో మూతపడిన 4 ప్రైమరీ స్కూల్స్ ఈఏడాది షురూ కానుండగా, ఆడ్మిషన్ తీసుకునే విద్యార్థుల వివరాలను అధికారులు సేకరించారు.
పల్లెమడుగు తండాలో ఇప్పటికే ప్రారంభం..
గాంధారి మండలం పల్లెమడుగు తండాలో ఇప్పటికే మూతపడిన ప్రైమరీ స్కూల్ తిరిగి ఇటీవల ప్రారంభమైంది. గతంలో ఇక్కడ విద్యార్థులు లేక మూసివేశారు. కొందరు విద్యార్థులు సమీపంలోని స్కూల్స్‌కు వెళ్లి చదువుకునేవారు. స్కూల్ ఓపెన్ చేస్తే విద్యార్థులను పంపిస్తామని స్థానికులు అధికారులకు విన్నవించారు. ఇక్కడ 15 మంది విద్యార్థులు చేరారు. డిప్యూటేషన్‌పై ఓ టీచర్‌ను నియమించినట్లు అధికారులు తెలిపారు.
ప్రతి ఊరికి బడి సర్కార్ లక్ష్యం..
ప్రతి పంచాయతీలో సర్కారు బడి ఉండాలనేది ప్రభుత్వం లక్ష్యం. విద్యాశాఖపై పలుమార్లు రివ్యూ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ బడుల బలోపేతంపై చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయగా, ఏఐ ద్వారా క్లాస్‌లు చెబుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలో మూతపడిన సర్కారు బడుల వివరాలను అధికారులు సేకరించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 24 పంచాయతీల్లో సర్కారు బడులు లేవని అధికారులు గతంలోనే నివేదిక పంపారు.
ఇందులో కామారెడ్డి జిల్లాలో 10, నిజామాబాద్ జిల్లాలో 14 ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలోని కొటాల్పల్లి ( కామారెడ్డి మండలం), కొల్లూర్ ( బాన్సువాడ మండలం), మధురతండా ( జుక్కల్మండలం), జగన్నాథ్ తండా ( పిట్లం మండలం), దగ్గి ( సదాశివనగర్ మండలం), మాచారెడ్డి మండలంలోని వెనుకతండా, సర్ధాపూర్ తండా, నెమ్లిగుట్టతండా, మర్రితండా, ఎల్లారెడ్డి మండలంలోని దేవల్ మల్కాపూర్ స్కూల్స్ ఉన్నాయి.
ఆసక్తి ఉన్న చోట ఓపెన్..
విద్యార్థులు చేరేందుకు ఆసక్తి ఉన్న చోట బడులు తెరిచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇక్కడ విద్యార్థుల సంఖ్య సేకరించి ఉన్నతాధికారులకు నివేదించగా, జిల్లాలో 4 ప్రైమరీ స్కూల్స్ ఓపెన్ చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు. టీచర్లను డిప్యూటేషన్‌పై పంపనున్నారు. జిల్లాలో ఈ అకాడమిక్ ఇయర్లో సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
రీ ఓపెన్ అయిన స్కూల్స్
మండలం స్కూల్
భిక్కనూరు మోటాట్పల్లి 28
జుక్కల్ మధురతండా 39
మాచారెడ్డి నెమ్లిగుట్టతండా 26
సదాశివనగర్ దగ్గి 26