- బస్టాండ్‌కు భూమిపూజ చేసిన కరీంనగర్ ఈడీ
తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం లో 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్కసారలమ్మ మహా జాతరకు 4 వేల బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సొలోమాన్, వరంగల్ ఆర్ఎం డి.విజయ భాను తెలిపారు. గురువారం వరంగల్ ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ మహేశ్, డిప్యూటీ రీజినల్ మేనేజర్ కె.భానుకిరణ్, ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజనీర్ రవీంద్రసింగ్, వరంగల్ డిపో మేనేజర్ ఎం రవీంద్రతో కలిసి మేడారంలో పర్యటించారు.
వనదేవతలను దర్శనం చేసుకున్న అనంతరం వై జంక్షన్ లో ఆర్టీసీ బస్టాండ్‌కు భూమిపూజ చేశారు. మహా జాతరకు 4 వేల ఆర్టీసీ బస్సులు నడుపుతామని చెప్పారు. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించకుండా, ఆర్టీసీ బస్సులను ఆదరించాలని కోరారు.
30 ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు
మేడారం మహా జాతరలో 30 ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు ములుగు డీఎంహెచ్‌వో గోపాల్ రావు తెలిపారు. గురువారం డిప్యూటీ డీఎంహెచ్‌వో పివిన్ కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్లు శ్రీకాంత్, పవన్ కుమార్, రణధీర్, సంపత్, డెమో సంజీవరావుతో కలిసి మేడారంలో పర్యటించారు.
జాతరలో ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు కోసం స్థలాలను పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్యం అందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి డాక్టర్లు, సిబ్బందిని సమకూర్చుతామని చెప్పారు. మెడిసిన్స్, బెడ్స్ అందుబాటులో ఉంచి భక్తులకు వైద్యం అందిస్తామన్నారు.
