కల్కి ఆశ్రమాలు: 40 కోట్ల నగదు.. 88 కేజీల గోల్డ్​ స్వాధీనం

కల్కి ఆశ్రమాలు: 40 కోట్ల నగదు.. 88 కేజీల గోల్డ్​ స్వాధీనం

కల్కి ఆశ్రమాల్లో స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు

18 కోట్ల విదేశీ కరెన్సీ..5 కోట్ల విలువైన వజ్రాలు కూడా

రూ.409 కోట్ల వ్యవహారాల రసీదులు లేవని గుర్తింపు

తెలంగాణ, ఏపీ, తమిళనాడులోని కల్కి భగవాన్‌‌ ఆశ్రమాల్లో శుక్రవారం కూడా ఐటీ సోదాలు కొనసాగాయి. అధికారులు భారీగా అక్రమాస్తులను గుర్తించారు. భూముల కొనుగోళ్ల  కీలక పత్రాలు, కంప్యూటర్​  హార్డ్‌‌ డిస్క్‌‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఐటీశాఖ చెన్నైలో ఒక ప్రకటన విడుదల చేసింది. కల్కి ఆశ్రమాల్లో జరిపిన సోదాల్లో రూ.93 కోట్ల విలువ చేసే బంగారు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. అందులో రూ.40.39 కోట్ల నగదు, 18 కోట్ల విదేశీ కరెన్సీ, రూ.5 కోట్లు విలువ చేసే వజ్రాలు, రూ.-26 కోట్లు విలువ చేసే 88 కేజీల బంగారం ఉన్నట్టు పేర్కొంది. రూ.-409 కోట్ల వ్యవహారాలకు సంబంధించి రసీదులు లేవని నిర్ధారించినట్లు వెల్లడించింది. సోదాలు, విచారణ కొనసాగుతాయని అధికారులు ప్రకటించారు.

అదో మిస్టరీ

కల్కి భగవాన్‌‌ ఆశ్రమం అంటేనే ఓ మిస్టరీ. మన రాష్ట్రంతోపాటు ఏపీ, తమిళనాడులో ఆ ఆశ్రమం గురించి తెలియని వారు ఉండరు. కానీ అక్కడ జరిగే కార్యక్రమాలేమీ బయటకు తెలియవు. భక్తి ముసుగులో భక్తుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గత 30 ఏళ్లుగా ఈ ఆశ్రమం వివాదాల్లోనే ఉంది. తాజా ఐటీ దాడులతో మరోసారి వార్తల్లోకి చేరింది కల్కి ఆశ్రమం.

చిరుద్యోగి నుంచి భగవాన్​స్థాయికి

ఆయన పేరు విజయ్‌‌కుమార్‌‌. గతంలో ఓ ప్రైవేట్ సంస్థలో చిరుద్యోగిగా పనిచేశారు. 1990కి ముందు ఉద్యోగాన్ని వదిలేసి కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో స్కూలు ప్రారంభించారు. తర్వాత కొంతకాలానికి దివాలా తీశారు. కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఒకరోజు ఉన్నట్టుండి బయటికొచ్చి.. తాను విష్ణుమూర్తి దశావతారం కల్కి భగవాన్‌‌ అని ప్రకటించుకున్నారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో  నాలుగెకరాల్లో ఆశ్రమాన్ని ప్రారంభించారు. కల్కి భగవాన్​గా మారారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో దేశవిదేశాల్లో బాగా ప్రచారం చేసుకున్నారు. ఆధ్యాత్మిక సంస్థ ముసుగులో రూ.వందల కోట్లల్లో అక్రమ ఆస్తులు వెనకేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఎన్ఆర్ఐ, విదేశీ భక్తులే టార్గెట్

కల్కి భగవాన్‌‌, అమ్మా భగవాన్​గా ప్రచారం పొందిన విజయకుమార్‌‌, ఆయన భార్య పద్మావతి.. దైవాంశ స్వరూపులుగా చెప్పుకున్నారు. ప్రధానంగా విదేశీయులు, ఎన్‌‌ఆర్‌‌ఐలు టార్గెట్​గా ఆశ్రమ కార్యక్రమాలు సాగేవి. సాధారణ దర్శనానికి రూ.5 వేలు, ప్రత్యేక దర్శనం కోసం రూ.25 వేల నుంచి లక్షల్లో వసూలు చేసేవారని ఆరోపణలు ఉన్నాయి. ధ్యానం, ఇతర శిక్షణ తరగతులతో భారీగా వసూళ్లకు పాల్పడే వారని తెలుస్తోంది. ఇలా పెద్ద ఎత్తున కూడబెట్టుకున్న సొమ్ముతో తమ కుటుంబ సభ్యులతోపాటు బినామీ పేర్లతో కార్పొరేట్ తరహాలో ఆశ్రమ అనుబంధ సంస్థలు నెలకొల్పినట్టు, అందుకోసం వందల కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు ప్రచారం ఉంది.

పేర్లు మార్చుతూ..

చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని కల్కి ఆశ్రమంలో 2008లో తొక్కిసలాట జరిగింది. దీంతో కొంతకాలం ఆశ్రమం మూసివేశారు. తర్వాత గోల్డెన్‌‌ సిటీ అని, మరికొంత కాలానికి ‘వన్నెస్‌‌’ అని ఆశ్రమం పేరును మార్చారు. ప్రస్తుతం ‘ఏకం’ పేరుతో వ్యవహారాలు సాగుతున్నాయి. ‘గోల్డెన్‌‌ షెల్టర్స్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌’ పేరుతో లావాదేవీలు జరుపుతున్నారు. ఇందులో సుమారు 1,200 మందికిపైగా పనిచేస్తున్నారు. గతంలో సిబ్బంది నెలవారీ వేతనాలతోపాటు విరాళాలు, కొనుగోళ్లకు ఐటీ రిటర్న్స్‌‌ కూడా ఫైల్​చేసేవారు. అయితే ఐటీ రిటర్న్స్​ కొంతకాలంగా నిలిపేసినట్టు ఫిర్యాదులందాయి. దీంతో కల్కి ఆశ్రమంపై నిఘా పడింది. ఆక్రమ ఆస్తులపైనా ఐటీ శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తినట్లు సమాచారం. దీంతో ఏకకాలంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడులో ఐటీ శాఖ దాడులు నిర్వహించింది.