పంచాయతీ కార్యదర్శులకు 5 రోజుల్లో 400 నోటీసులు

పంచాయతీ కార్యదర్శులకు 5 రోజుల్లో 400 నోటీసులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 3న మొదలైన పల్లె ప్రగతి కార్యక్రమం పంచాయతీ కార్యదర్శులకు తలనొప్పిగా మారింది. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కలెక్టర్లు, డీపీవోలు, ఎంపీవోలు వారిపై చర్యలు తీసుకుంటున్నారు. వివరణ ఇవ్వాలని కొంత మందికి షోకాజ్ నోటీసులు ఇస్తుండగా, మరికొంత మందిని ఏకంగా డ్యూటీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. పంచాయతీ రాజ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నోటీసులు ఇస్తున్నామని జిల్లా, మండల అధికారులు చెబుతున్నారు. అయితే, ఇప్పటిదాకా 400 షోకాజ్, సస్పెన్షన్ నోటీసులు ఇచ్చినట్లు సెక్రటరీలు చెబుతున్నారు. రాష్ట్రంలో 12,769 మంది పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు. వీరిలో 2500 మంది దాకా రెగ్యులర్ సెక్రటరీలు ఉండగా.. మిగతా 10 వేల మంది రెగ్యులర్ కాని జూనియర్ పంచాయతీ సెక్రటరీలే. జూనియర్లను ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో రెగ్యులర్ చేయాల్సి ఉన్నా.. ప్రొబేషన్ పీరియడ్‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది.

ప్రతిసారి ఇంతే

ప్రస్తుతం ఐదో విడత పల్లె ప్రగతి జరుగుతోంది. ప్రతి సారి పల్లె ప్రగతి మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే దాకా 15 రోజుల్లో షోకాజ్ నోటీసులు అందుకుంటున్న, సస్పెండ్ అవుతున్న సెక్రటరీల సంఖ్య వందల్లోనే ఉంటున్నది. రోజుకు 12 గంటలు డ్యూటీ చేస్తున్నా ఇదేం టార్చర్ అని సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని ఒత్తిడి, అధికారుల వేధింపుల వల్ల గత రెండేళ్లలో వెయ్యి మందికిపైగా తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఓవైపు సెక్రటరీలు మంచిగా పనిచేస్తున్నారని,  ఊర్లు ఎంతో డెవలప్ అయ్యి జాతీయ అవార్డులు వస్తున్నాయంటూ సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల దాకా పొగడ్తలు కురిపిస్తూనే మరోవైపు ఇలా వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇటీవల టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సమయంలో పంచాయతీ రాజ్ ఉన్నతాధికారి ఒకరు జిల్లా, మండల అధికారులపై సీరియస్ అయ్యారు. సరిగ్గా పని చేయకుంటే సస్పెండ్ చేయాలని సీరియస్‌‌‌‌‌‌‌‌గా ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

పొద్దున, రాత్రి గూగుల్ మీట్‌‌‌‌‌‌‌‌

సెక్రటరీల అటెండెన్స్ అంశం గతంలో వివాదాస్పదమైంది. రోజూ ఉదయం 6, 7 గంటల కల్లా డీఎస్ఆర్ యాప్‌‌‌‌‌‌‌‌లో అటెండెన్స్ నమోదు చేయాలని అధికారులు ఆదేశాలిచ్చారు. చెత్త సేకరించే ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సెక్రటరీ ఉండి సెల్ఫీ దిగి పంపాలని ఇచ్చిన ఆదేశాలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో అధికారులు వెనక్కి తగ్గి.. పొద్దున 9 కల్లా అటెండెన్స్ నమోదు చేయాలని సవరించారు. పల్లె ప్రగతి మొదలయ్యాక ఉదయం 7, సాయంత్రం 7 గంటలకు గూగుల్‌‌‌‌‌‌‌‌ మీట్‌‌‌‌‌‌‌‌కు అటెండ్ కావాలని అధికారులు ఆదేశాలు ఇస్తున్నారు.

మాతో అవసరం లేదనుకుంటే తీసేయండి

ఆదివారం డ్యూటీకి రాలేదని మెమో ఇచ్చారు. రోజూ 12 గంటలు కష్టపడి పని చేస్తున్నా గుర్తింపు ఉండటం లేదు. రెండేళ్లు ప్రొబేషన్ టైమ్ ఉంటే ఇంకో ఏడాది పెంచారు. మాతో పని అయిపోయిందనుకుంటే తీసేయండి. వేరే జాబ్‌‌‌‌‌‌‌‌కు ప్రిపేర్ అయితం. పని ఒత్తిడి, అధికారుల వేధింపుల వల్ల రెండున్నరేండ్లలో రాష్ట్రంలో 40 మంది సెక్రటరీలు చనిపోతే.. 26 మంది ఆత్మహత్య చేసుకున్నరు. బయట పనికి పోతే రోజుకు రూ.500 వస్తున్నయి. మరి రూ.200 కూలి కోసం ఉపాధి పనులకు ఎవరు వస్తరు. వచ్చినా ఆ పైసలు ఎప్పుడిస్తరో తెలియదు. గ్రామంలో 200 మంది ఉపాధి పనులకు రాకపోతే సెక్రటరీలను సస్పెండ్ చేయాలంటూ ఓ ఉన్నతాధికారి టెలికాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌లో జిల్లా, మండల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.   - గద్వాలకు చెందిన పంచాయతీ సెక్రటరీ

పని చేస్తున్నా నోటీసులిస్తరా?

పల్లె ప్రగతి కార్యక్రమం 4 సార్లు సక్సెస్ అవటానికి కారణం సెక్రటరీలే. అలాంటిది షోకాజ్, సస్పెన్షన్ నోటీసులు ఎట్ల ఇస్తరు? 5 రోజుల్లో 400 నోటీసులు ఇచ్చారు. సెక్రటరీలు పనిచేయందే దేశంలో టాప్ 20లో 19 తెలంగాణ గ్రామాలకు అవార్డులు ఎట్ల వస్తయి? షోకాజ్, సస్పెన్షన్ నోటీసులు ఇస్తూ ఇదే వైఖరి కొనసాగిస్తే సెక్రటరీలందరం కలిసి ఏ నిర్ణయానికైనా వెనుకాడబోం.      
- మహేశ్, పంచాయతీ కార్యదర్శుల సంఘం స్టేట్ ప్రెసిడెంట్