- ఇక్కడ ఉంటే.. నా ఇంట్లో ఉన్నట్టే ఉంది
- దౌత్య బంధం.. వ్యూహాత్మక బంధంగా మారిందని వెల్లడి
- ఆ దేశ పార్లమెంట్‌లో ప్రధాని ప్రసంగం
- మోదీని కారులో తీసుకెళ్లి ఎయిర్‌పోర్టులో దింపిన అక్కడి పీఎం
- మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం
ఆడిస్ అబాబా: ఇథియోపియాలో ఉంటే.. తన ఇంట్లో ఉన్నట్టే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘ఇథియోపియా సింహాలకు నిలయం. అలాగే నా సొంత రాష్ట్రం గుజరాత్ కూడా. అందుకే ఇక్కడ ఉంటే నా ఇంట్లో ఉన్నట్టే ఉంది” అని పేర్కొన్నారు. బుధవారం ఇథియోపియా పార్లమెంట్‌లో మోదీ మాట్లాడారు. ఇథియోపియా, ఇండియా నేచురల్ పార్టనర్స్ అని ఆయన అన్నారు. ‘‘ఆఫ్రికా జంక్షన్‌లో ఇథియోపియా ఉంది. ఇండియన్ ఓషియన్‌కు ముఖ్యమైన స్థానంలో ఇండియా ఉంది. మేం ఇద్దరం రీజినల్ పీస్, సెక్యూరిటీ, కనెక్టివిటీలో సహజ భాగస్వాములం.
మేమంతా ఒకే కుటుంబంలా మరింత న్యాయమైన, మరింత సమానమైన, మరింత శాంతియుతమైన ప్రపంచం కోసం పనిచేస్తం” అని తెలిపారు. ‘‘గ్లోబల్ సౌత్ ఎవరికీ వ్యతిరేకం కాదు.. ఇది అందరి అభివృద్ధి కోసం పని చేస్తుంది. ఈ రీజియన్ తన భవిష్యత్తును తానే రాసుకుంటున్నది. మేం సమకాలీకులుగా కలిసి పనిచేస్తం.. పార్టనర్స్‌గా కలిసి నిర్మిస్తాం.. ఫ్రెండ్స్‌గా కలిసి సాధిస్తాం” అని పేర్కొన్నారు. ఇప్పటికే తమ దౌత్య సంబంధాలను వ్యూహాత్మక సంబంధాలుగా మార్చుకున్నామని తెలిపారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్, మైనింగ్, క్లీన్ ఎనర్జీ, ఫుడ్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, డిఫెన్స్, సెక్యూరిటీ రంగాల్లో రెండు దేశాలు సహకరించుకుంటాయని వెల్లడించారు.
టీ, కాఫీలా బంధం బలోపేతం..
ఇండియా, ఇథియోపియా పురాతన నాగరికతలు కలిగిన దేశాలని మోదీ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సారూప్యతలు ఉన్నాయని తెలిపారు. ‘‘భారత జాతీయ గేయం ‘వందేమాతరం’, ఇథియోపియా జాతీయ గీతం.. రెండూ మన సొంతగడ్డను మాతృభూమిగా సూచిస్తాయి. మన వారసత్వం, సంస్కృతి, ప్రకృతి సౌందర్యాల విషయంలో గర్వపడేలా.. మాతృభూమిని సంరక్షించేలా స్ఫూర్తినిస్తాయి. మనవి శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలు. ఇథియోపియన్ కాఫీ, ఇండియన్ టీ లాగా మన స్నేహబంధం మరింత బలపడుతున్నది” అని అభివర్ణించారు. ఇథియోపియా అభివృద్ధికి వేలాది మంది ఇండియన్ టీచర్లు కృషి చేస్తున్నారు. ఇండియన్ కంపెనీలు టెక్స్‌టైల్, మాన్యుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్, హెల్త్ తదితర రంగాల్లో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. 75 వేల ఉద్యోగాలను సృష్టించాయి. రెండు దేశాలకూ వ్యవసాయమే వెన్నెముక.. అందుకే నాణ్యమైన విత్తనాలు, ఉత్తమ ఇరిగేషన్ సిస్టమ్స్, భూపరిరక్షణకు రెండు దేశాలు కలిసి పనిచేయాలి” అని పిలుపునిచ్చారు.
మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
ఇథియోపియా పార్లమెంట్‌లో మోదీ ప్రసంగానికి అక్కడి చట్టసభ సభ్యులు ఫిదా అయ్యారు. దాదాపు 50 సార్లకు పైగా చప్పట్లతో అభినందించారు. మోదీ స్పీచ్ అయిపోగానే, అందరూ నిలబడి గౌరవించారు. అంతకుముందు ఇథియోపియా పార్లమెంట్‌లో మోదీ మొక్కను నాటారు. ఆ దేశ ధైర్యం, ఐక్యత, స్ఫూర్తికి నిదర్శనమైన అద్వా విజయ చిహ్నం వద్ద నివాళి అర్పించారు. కాగా, ఇథియోపియా అత్యున్నత పురస్కారం ‘ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ ను మోదీ అందుకున్నారు. ఈ అవార్డును ఆ దేశ ప్రధాని అబి అహ్మద్ అలీ ఆయనకు అందజేశారు. దీన్ని అందుకున్న తొలి విదేశీ నేత మోదీనే కావడం విశేషం.
