బంగ్లాదేశ్లో భారత వీసా కేంద్రం క్లోజ్.. బెదిరింపుల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం

బంగ్లాదేశ్లో భారత వీసా కేంద్రం క్లోజ్.. బెదిరింపుల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం
  • ఆ దేశంలో క్షీణిస్తున్న భద్రతపై ఆందోళన 
  • బంగ్లాదేశ్ హైకమిషనర్​కు భారత్ సమన్లు

ఢాకా/ న్యూఢిల్లీ: బంగ్లాదేశ్​లో శాంతిభద్రతలు క్షీణించడం, అక్కడి నేతల విధ్వేషపూరిత ప్రసంగాల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢాకాలోని భారత వీసా అప్లికేషన్ సెంటర్ (ఐవీఏసీ) ను మూసివేసింది. స్థానికంగా జరుగుతున్న యాంటీ ఇండియా ఉద్యమం, ఎంబసీకి బెదిరింపుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. ఈమేరకు వీసా అప్లికేషన్ సెంటర్ ఓ ప్రకటన విడుదల చేస్తూ.. బుధవారం మధ్యాహ్నం నుంచి ఢాకాలోని జమునా ఫ్యూచర్ పార్క్ సమీపంలోని వీసా సెంటర్ ను మూసేసినట్లు తెలిపింది. 

వీసా ఇంటర్వ్యూల కోసం స్లాట్ లు బుక్ చేసుకున్న అభ్యర్థులకు తర్వాత స్లాట్ లు కేటాయిస్తామని పేర్కొంది. కాగా, బంగ్లాదేశ్ వ్యాప్తంగా మొత్తం 16 భారత వీసా కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో ఏటా 22 లక్షల వీసాలను ప్రాసెస్ చేస్తామని అధికారులు తెలిపారు.

బంగ్లాదేశ్ హైకమిషనర్​కు భారత్ సమన్లు

బంగ్లాదేశ్‌‌‌‌ హైకమిషనర్‌‌‌‌ రిజాజ్‌‌‌‌ హమీదుల్లాకు భారత్‌‌‌‌ దౌత్యపరమైన నిరసన తెలియజేసింది. ఆయనకు సమన్లు జారీ చేసింది. ఢాకాలోని భారత దౌత్య కార్యాలయానికి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది.  ఈమేరకు బుధవారం ఫారిన్ మినిస్ట్రీ ఒక ప్రకటన జారీ చేసింది. బంగ్లాలో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులపై హమీదుల్లా ముందు ఆందోళన వ్యక్తం చేసినట్టు పేర్కొంది. ముఖ్యంగా ఢాకాలోని భారత రాయబార కార్యాలయంపై అక్కడి వ్యక్తులు బెదిరింపులకు పాల్పడిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించింది.