బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల గొడవ..పలు జిల్లాల్లో చోటు చేసుకున్న ఘటనలు

బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల గొడవ..పలు జిల్లాల్లో చోటు చేసుకున్న   ఘటనలు
  • ఘర్షణల్లో గాయపడిన పలువురు వ్యక్తులు, పోలీసులు

వెలుగు, నెట్ వర్క్ : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల చివరి విడత పోలింగ్ సందర్భంగా బుధవారం పలు జిల్లాల్లో  ఉద్రిక్తతలు, ఆందోళనలు జరిగాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు జరిగాయి.  పలువురు వ్యక్తులు, పోలీసులు గాయపడ్డారు.  పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. 

వికారాబాద్ జిల్లాలో..

పరిగి : వికారాబాద్ ​జిల్లా పరిగి మండలం మాదా రం పోలింగ్​ సెంటర్​లో ఓటర్లకు  బీఆర్ఎస్  ఏజెంట్లు తమ సర్పంచ్ ​అభ్యర్థి గుర్తులు చెబుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. దీంతో ఇరు  వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్​కు చెందిన చిల్కమరి సాయిరాం, అనంతగారి సాయిరాంలో ఒకరికి తలపగిలింది. మరొకరికి తీవ్రంగా దెబ్బలు తగలగా.. బీఆర్ఎస్​సర్పంచ్​అభ్యర్థి రాములు స్పృహ కోల్పోగా పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు మెరుగైన వైద్యానికి హైదరా బాద్ కు రెఫర్ చేశారు.  సమాచారం తెలియడంతో పరిగి ఎమ్మెల్యే టి.రాంమ్మోహన్​రెడ్డి,  మాజీ ఎమ్మెల్యే కొప్పల మహేశ్​రెడ్డి ఆస్పత్రికి వెళ్లి తమ కార్యకర్తలను పరామర్శించారు.  

రంగారెడ్డి జిల్లాలో..

మంచాల మండలం అస్మత్ పూర్ పోలింగ్ బూత్ లోపల ఎనిమిదో వార్డు మెంబర్ అభ్యర్థి ప్రచారం చేస్తుండగా, ఇతర పార్టీల నేతలు ఎన్నికల అధికారి ఫిర్యాదు చేశారు. మరల అతడిని లోపలికి రానివ్వకుండా చూస్తామని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.  

మహబూబాబాద్​ జిల్లాలో..  

మహబూబాబాద్ : మహబూబాబాద్​జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లి పోలింగ్​కేంద్రం సమీపంలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యకర్త ఫొటోలు తీస్తుండగా ఘర్షణ జరిగింది.  దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకోవడంతో ఉద్రికత్త నెలకొంది. పోలీసులు వెళ్లి లాఠీచార్జ్​ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. 

పొగుళ్లపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి వీరన్న పోలింగ్ సెంటర్ లో ప్రచారం చేస్తున్నాడని కాంగ్రెస్ సర్పంచ్​అభ్యర్థి నునావత్ ఈర్య, మరో నలుగురు కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థిని బయటకు పంపించారు. 

తన మీదనే కంప్లయింట్ చేస్తావా.. ? అంటూ బీఆర్ఎస్ అభ్యర్థి వీరన్న, కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థితో వాదనకు దిగారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరగ్గా బోరింగ్ ​తండాకు చెందిన  బానోతు స్వాతి కిందపడింది.  ఆమెను పలువురు తొక్కడంతో  నడుముకు తీవ్రగాయమైంది. కాంగ్రెస్ కార్యకర్తల రెండు సెల్ ఫోన్లు పోయాయి.  సీఐ సూర్యప్రకాష్ , ఎస్ఐ రాజకుమార్ వెళ్లి ఇరువర్గాలను చెదరగొట్టారు.