ఓలా, ఉబర్కు పోటీగా భారత్ ట్యాక్సీ..జనవరి 1 నుంచి అందుబాటులోకి

ఓలా, ఉబర్కు పోటీగా భారత్ ట్యాక్సీ..జనవరి 1 నుంచి అందుబాటులోకి

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. ఓలా, ఉబర్, ర్యాపిడోలకు పోటీగా భారత్ ట్యాక్సీ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. జనవరి 1 నుంచి ఈ ట్యాక్సీ సేవలను ప్రారంభించనుంది. సహకార్ ట్యాక్సీ కో ఆపరేటివ్ లిమిటెడ్ జీరో కమిషన్ మోడల్ లో దీన్ని నిర్వహించనుంది. భారత్ ట్యాక్సీ యాప్ ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటి ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

కార్లు, ఆటోరిక్షాలు, బైక్ ల సేవలు అన్ని ఈ యాప్ లో అందుబాటులో ఉంటాయి. ఈ యాప్​లో ముందుగా కస్టమర్లు తమ మొబైల్ నంబర్ తో రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం పికప్, డ్రాప్ లొకేషన్లను నమోదు చేసి రైడ్​ను ఎంచుకోవాలి. ప్రస్తుతం సర్వీసులు అందిస్తున్న సంస్థల అధిక ధరలను కట్టడి చేసేందుకే ప్రభుత్వం భారత్ ట్యాక్సీ యాప్ ను తీసుకొచ్చింది. 

జీరో కమిషన్ మోడల్ కావడంతో కస్టమర్లు చెల్లించే అమౌంట్ లో 80 శాతం నేరుగా డ్రైవర్ల ఖాతాలోకే వెళ్తుంది. భారత్ ట్యాక్సీ యాప్ లో ఇప్పటికే 56 వేల మంది డ్రైవర్లు రిజిస్టర్ చేసుకున్నారని కేంద్రప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. భారత్ ట్యాక్సీకి సంబంధించి ఢిల్లీలో ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తయింది. గుజరాత్ లోని రాజ్ కోట్ లో కూడా ప్రయోగాత్మక పరీక్షను నిర్వహిస్తున్నారు. 

ఈ సిటీలో ఫిబ్రవరి 1 నుంచి సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నారు. దీనిని క్రమంగా 20కిపైగా సిటీలకు విస్తరించాలనే ఆలోచనలో ఉన్నారు.