- రూ.5 వేల కోట్ల మేర సబ్సిడీలు, రాయితీలు పెండింగ్
- ఆరేండ్ల నుంచి పైసా విడుదల చేయని ప్రభుత్వం
- సబ్సిడీలపై కేటీఆర్‌కు విజ్ఞప్తి చేసినా స్పందన కరువు
హైదరాబాద్, వెలుగు: పెద్ద కంపెనీలు, భారీ పెట్టుబడులు వస్తున్నాయంటూ ప్రకటనలు చేస్తున్న రాష్ట్ర సర్కార్.. చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లను మాత్రం గాలికొదిలేసింది. సర్కారును నమ్మి ఎన్నో ఆశలతో వాటిని మొదలుపెట్టిన యజమానులు.. ఇప్పుడు వాటిని నడపలేక మూసేస్తున్నారు. మరికొందరు పెద్ద కంపెనీలకు అమ్ముకుంటున్నారు. మూడేండ్లలో 4 వేలకుపైగా ఎంఎస్ఎంఈలు మూతపడగా.. మరో 2,800 ఇండస్ట్రీలు పెద్ద కంపెనీల చేతుల్లోకి వెళ్లాయి. ఇవి రిజిస్టర్ అయిన కంపెనీల లెక్కే. అవి కాకుండా రిజిస్టర్ కాని చిన్న పరిశ్రమలు 26 లక్షలకుపైనే ఉండగా.. వాటిలో లక్షల్లోనే మూతపడ్డాయని పారిశ్రామికవేత్తలు చెప్తున్నారు. ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అందజేస్తామని రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ప్రభుత్వం ప్రకటించినా.. టీఆర్ఎస్తో సంబంధాలున్న కొన్ని ఇండస్ట్రీలకే ఆ సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మిగతా వాటికి సర్కారు మొండి చెయ్యి చూపడం, మరోవైపు కరోనాతో వ్యాపారం దెబ్బతినడంతో మూసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
రాష్ట్రం వచ్చినప్పట్నుంచి ఇప్పటిదాకా ఇండస్ట్రీలకు సర్కార్ రూ.5 వేల కోట్ల రాయితీలను బకాయి పడింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విడుదలైన రూ.800 కోట్ల బకాయిలను ఇవ్వడం తప్ప.. రాష్ట్ర సర్కారు ఇప్పటిదాకా ఇచ్చింది లేదని, వాటిలోనూ పెద్ద ఇండస్ట్రీలకే ఎక్కువ మొత్తంలో ఇచ్చారని అంటున్నారు. ఇటీవల పరిశ్రమలకు సంబంధించి వార్షిక నివేదిక విడుదల సందర్భంగా మంత్రి కేటీఆర్‌ను కలిసి ఆదుకోవాలని కోరినా సానుకూల స్పందన రాలేదని ఎంఎస్ఎంఈల ప్రతినిధులు వాపోతున్నారు.
బ్యాంకులు లోన్లూ ఇయ్యట్లే..
కరోనా టైంలో వందలాది ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి. లాక్డౌన్ అయిపోయాక ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నించిన ఆ ఇండస్ట్రీలకు ప్రభుత్వ సహకారం కరువైంది. బ్యాంకులు కూడా లోన్లు ఇవ్వడం లేదు. దీంతో చాలా సంస్థలను ఓనర్లు నష్టాలకే అమ్ముకున్నారు. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 15 వేల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. వాటి ద్వారా రూ.19 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ఏటా నివేదికల్లో వెల్లడిస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి. ఏర్పాటైన వాటిలో పటాన్చెరు, జీడిమెట్ల, పాశమైలారంలో అధిక సంఖ్యలో ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి. నష్టాలను తట్టుకుంటూ నెట్టుకొస్తున్న కొందరు యజమానులు.. చేయూతనిస్తే నష్టాల నుంచి బయటపడతామని, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు.
ఆరేండ్లుగా నిధులియ్యట్లే..
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్థానికంగా పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాల ఆధారంగా సబ్సిడీలు ఇస్తామంటూ రాష్ట్రం వచ్చిన కొత్తలో ప్రభుత్వం ప్రకటించింది. స్టాంప్ డ్యూటీ రీఫండ్, పెట్టుబడి మొత్తంలో పరిశ్రమలను బట్టి 20 నుంచి 25 శాతం వరకు సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చింది. మహిళా పారిశ్రామికవేత్తలైతే అదనంగా మరో 10 శాతం, ఎస్సీ, ఎస్టీలకు పరిశ్రమ స్థాయిని బట్టి మరింత రాయితీ ఉంటుందని తెలిపింది. ఇవే కాకుండా పావలా వడ్డీ లోన్లు, కరెంట్వాడకంలో రాయితీ, పట్టణ, జిల్లా స్థాయిలో పరిశ్రమలు, ప్రాంతాలవారీగా ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. కానీ ఆరేండ్లుగా వీటికి సంబంధించిన నిధులను మాత్రం రిలీజ్ చేయడం లేదు. గూగుల్, యాపిల్, అమెజాన్ అంటూ కొత్త పరిశ్రమల ఏర్పాటుపై గొప్పగా చెప్పుకొంటున్న సర్కారు.. ఉన్న పరిశ్రమలను కాపాడడానికి మాత్రం ఆసక్తి చూపించట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు రాయితీ బకాయిలను విడుదల చేసినా మన సర్కారు మాత్రం విడుదల చేయకపోవడంపై పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయితీల విడుదలపై సర్కారు స్పష్టమైన హామీ ఇవ్వకుంటే మరిన్ని ఎంఎస్ఎంఈలు మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
హామీలే.. చర్యల్లేవ్
కరోనా టైంలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఆ దిశగా చర్యలు మాత్రం లేవు. పెండింగ్‌లో ఉన్న రూ.5 వేల కోట్ల రాయితీలను వెంటనే విడుదల చేయాలి. - జనార్దన్ రెడ్డి, ఇండస్ట్రియలిస్ట్
సబ్సిడీలు, ఇన్సెంటివ్స్ రిలీజ్ చేయాలి
పరిశ్రమలకు ఇవ్వాల్సిన సబ్సిడీలు, రాయితీలను ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలి. కరోనా టైంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలూ రావడం లేదు. సర్కారు సబ్సిడీలతో పాటు ఇన్సెంటివ్‌లను ఇస్తే నిలదొక్కు కుంటాం. విడతల వారీగా అయినా ఆ నిధులను రిలీజ్ చేయాలి. ‑ కళా రమేశ్, పటాన్చెరు ఐలా చైర్మన్
