- సర్పంచ్ స్థానానికి 4098, వార్డు సభ్యులకు 12,754 దాఖలు
- ఉమ్మడి 6 జిల్లాల్లో పోటాపోటీగా నామినేషన్లు
- 17న ఎన్నికల బరిలో తలపడనున్న అభ్యర్థులు
వరంగల్, వెలుగు: పల్లెపోరు మూడో విడతలో సర్పంచ్ కోసం 4,098 మంది బరిలో ఉండగా, వార్డు మెంబర్ల కోసం ఏకంగా 12,754 మంది సై అంటే సై అంటున్నారు. శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ చివరిరోజు కావడంతో సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల కోసం అభ్యర్థులు రాత్రి వరకు కూడా దరఖాస్తులు అందించారు. ఇందులో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఈ నెల 17న చివరి విడత ఎన్నికల పోరులో ఎవరి బలమేంతో చూపనున్నారు.
ములుగులో తక్కువ.., మహబూబాబాద్‍లో ఎక్కువ..
ఓరుగల్లులోని 6 జిల్లాల్లో చివరి మూడో విడత సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యుల ఎన్నికల్లో అత్యధిక నామినేషన్లతో మహబూబాబాద్ జిల్లా టాప్‍లో ఉండగా, ములుగు జిల్లా చివర్లో ఉంది. ఆరు జిల్లాల్లో మూడో విడతలో 564 జీపీలు ఉండగా, సర్పంచ్ పదవే లక్ష్యంగా 4,098 నామినేషన్లు వచ్చాయి. వార్డు సభ్యులు పోస్టులు 4,896 ఉండగా 12,754 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో సర్పంచ్ కోసం మహబూబాబాద్ జిల్లా నుంచి అత్యధికంగా 169 జీపీలకు 1185 నామినేషన్లు రాగా, 1,412 వార్డుల కోసం ఏకంగా 3,592 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా ములుగు జిల్లాలో 46 జీపీలకు 242 నామినేషన్లు రాగా, 408 వార్డుల కోసం 950 నామినేషన్ వేశారు. కాగా, నామినేషన్ వేసిన వారు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజాప్రతినిధులు, మద్దతుదారులతో కలిసి ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.
జిల్లాల వారీగా సర్పంచ్, వార్డు స్థానాల నామినేషన్లు..
జిల్లా జీపీలు సర్పంచ్ నామినేషన్లు వార్డులు వార్డు నామినేషన్లు
వరంగల్ 109 783 946 2,639
హనుమకొండ 68 514 634 1,822
జనగామ 91 688 800 1961
భూపాలపల్లి 81 686 696 1790
ములుగు 46 242 408 950
మహబూబాబాద్ 169 1185 1412 3,592
మొత్తం 564 4,098 4,896 12,754
