చంద్రుడిపై ప్రయోగాల్లో 40 శాతం ఫెయిలే

చంద్రుడిపై ప్రయోగాల్లో 40 శాతం ఫెయిలే

109 ప్రయోగాలు చేస్తే 48 విఫలం

తొలి ప్రయత్నంలో చేరుకోలేకపోయిన అమెరికా

చంద్రయాన్​2 ప్రయోగం మొత్తం ఫెయిలైపోయిందని చెప్పలేం. ఎందుకంటే, చేరాల్సిన కక్ష్యలను విజయవంతంగా దాటుకుని ముందుకెళ్లాం. ఆర్బిటర్​ను కక్ష్యలో పెట్టాం. విక్రమ్​ను చంద్రుడి దాకా తీసుకెళ్లాం. ల్యాండింగ్​ అయ్యేటప్పుడు దాని నుంచి జస్ట్​ సిగ్నళ్లను మాత్రమే మనం కోల్పోయాం. ఇప్పుడప్పుడే దానికి ఏం జరిగిందన్నది చెప్పలేం. మిషన్​ ఫెయిల్​ అయిందనడానికీ లేదు. ఎందుకంటే, మిషన్​లో 95 శాతం సక్సెసేనని, ఒక్క 5 శాతం మాత్రమే ఫెయిల్​ అని సైంటిస్టులు చెబుతున్నారు. మరి, ఇప్పటిదాకా ప్రపంచంలో జరిగిన చంద్రుడి ప్రయోగాలు చాలానే ఫెయిలయ్యాయి. ఇప్పుడు మూన్​ ప్రయోగాల్లో సక్సెస్​ చూసిన దేశాలు, మొదట్లో వైఫల్యాన్ని రుచి చూసినవే. 60 ఏళ్లలో చేసిన మూన్​ మిషన్లలో 40 శాతం ఫెయిలయ్యాయంటే నమ్ముతారా? నాసా చందమామ నిజాలు అన్న నివేదిక అదే చెబుతోంది.

చంద్రయాన్​ 2కు ముందు 109 ప్రయోగాలు జరిగితే అందులో 61 ప్రయోగాలు సక్సెస్​ అయ్యాయి. 48 మిషన్లు ఫెయిలయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్​లో ఇజ్రాయెల్​ పంపిన స్పేస్​క్రాఫ్ట్​ కూడా విక్రమ్​ లాగే ల్యాండ్​ అవ్వబోయింది. కాకపోతే అది కూలిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్పేస్​ఎక్స్​ రాకెట్​ ద్వారా కేప్​కెనవెరాల్​ నుంచి బియర్​షీట్​ పేరుతో ఇజ్రాయెల్​ చంద్రుడిపై ప్రయోగం చేసింది. ఇజ్రాయెల్​ చేసిన మొట్టమొదటి లూనార్​ మిషన్​ అది. స్పేస్​ఐఎల్​ అనే సంస్థ ఆధ్వర్యంలో ఆ ప్రయోగం చేసింది. చంద్రుడి వరకు బాగానే వెళ్లిన బియర్​షీట్​ ఏప్రిల్​ 11న చంద్రుడిపై క్రాష్​ల్యాండ్​ అయింది. చివరి నిమిషాల్లో ల్యాండర్​ ఇంజన్​ ఆగిపోయింది. అయితే, చివరి నిమిషంలో మళ్లీ ఇంజన్​ను ఆన్​ చేసినా ఫలితం లేకపోయింది. కమ్యూనికేషన్​ కట్​ అయింది. ప్రయోగంలో తాము ఫెయిలైనా చివరి వరకూ ప్రయత్నించామని స్పేస్​ఐఎల్​ ప్రకటించింది. చంద్రుడిపై అయస్కాంత క్షేత్రాలను గుర్తించే పరికరాలు, కెమెరాలను బియర్​షీట్​లో పంపించింది.

1958 నుంచి 2019 మధ్యలో ఇండియా, అమెరికా, సోవియట్​ యూనియన్​ (రష్యా), జపాన్​, యూరోపియన్​ యూనియన్​, చైనా, ఇజ్రాయెల్​ వంటి దేశాలు చందమామపై ప్రయోగాలు చేశాయి. 1958 ఆగస్టు 17న తొలిసారిగా పయనీర్​ పేరుతో అమెరికా ప్రయోగం చేసింది. అయితే, అది ఫెయిలైంది. మొట్టమొదటిసారిగా విజయవంతమైన చంద్రుడి ప్రయోగం లూనా 1. 1959 జనవరి 4న సోవియట్​ యూనియన్​ ఆ ప్రయోగం చేసింది. ఇది జస్ట్​ ఫ్లైబై మాత్రమే. అంటే అక్కడి వరకు వెళుతుందంతే. ఇదే మొదటి సక్సెస్​ఫుల్​ ఫ్లైబై మిషన్​ కూడా. ఈ సక్సెస్​ కూడా ఊరికే ఏం రాలేదు. ఆరు ప్రయోగాలు జరిగిన తర్వాతే గెలుపు సాధ్యమైంది. 1958 ఆగస్టు నుంచి 1959 నవంబర్​ మధ్య అమెరికా, రష్యాలే 14 మూన్​ మిషన్స్​ చేశాయి. తొలిసారిగా చంద్రుడి ఫొటోలు తీసింది మాత్రం నాసా ప్రయోగించిన రేంజర్​ 7 ప్రయోగం ద్వారానే. చంద్రుడిపై తొలిసారి దిగింది మాత్రం రష్యానే. 1966 జనవరిలో లూనా 9 ఆ ఘనత సాధించింది.