సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. సోమవారం ( నవంబర్ 17 ) తెల్లవారుజామున హజ్ యాత్రకు వెళ్లిన యాత్రికులతో వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ ను ఢీకొనడంతో 42 మంది సజీవ దహనమైనట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువమంది హైదరాబాదీలు అని తెలుస్తోంది. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారని.. వీరిలో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి బయటపడ్డ ఏకైక వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. యాత్రికులు మక్కాలో ఉమ్రా పూర్తి చేసుకొని మదీనాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్నవారంతా గాఢ నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే.. ఈ ప్రమాదంలో గాయాలతో బయటపడ్డవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అత్యవసర బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ ఘటనపై కేంద్రం, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్.
