ఫేక్ సర్టిఫికెట్ తో 43 వేల మందికి వైద్యం

ఫేక్ సర్టిఫికెట్ తో 43 వేల మందికి వైద్యం
  • హెల్త్ కేర్ ఫార్మసీ పేరుతో హాస్పిటల్ ప్రారంభం
  • అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ 

హనుమకొండ, వెలుగు : బీ ఫార్మసీ మధ్యలోనే ఆపేసిన ఓ వ్యక్తి ఫేక్​ సర్టిఫికెట్లతో వరంగల్​లో డాక్టర్​ అవతారం ఎత్తాడు. ఓ ల్యాబ్ ​టెక్నీషియన్​తో కలిసి హాస్పిటల్ ​కూడా ఓపెన్ చేశాడు.  ఇప్పటివరకు సుమారు 43 వేల మందికి ట్రీట్​మెంట్​ఇచ్చాడు. వరంగల్ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు ఈ నకిలీ డాక్టర్​ గుట్టురట్టు చేశారు.  రూ.1.9 లక్షల నగదు, ల్యాప్​టాప్​, సెల్​ఫోన్లు, ల్యాబ్​ఎక్విప్​మెంట్ స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ సీపీ డా.తరుణ్​ జోషి వివరాలు తెలియజేశారు. వరంగల్ కు చెందిన ముజతాబ అహ్మద్​ బీ ఫార్మసీ మధ్యలోనే అపేశాడు. స్థానికంగా ఉన్న ఓ డాక్టర్​ వద్ద అసిస్టెంట్ గా కొన్నేండ్లు పని చేశాడు. జీతం ఖర్చులకు చాలకపోవడంతో పెద్ద మొత్తంలో సంపాదించాలని ప్లాన్​ వేశాడు. ఎయిమ్స్ లో చదివినట్టు ఫేక్ ఎంబీబీఎస్​ సర్టిఫికెట్​ తయారు చేసుకుని డాక్టర్​ అవతారం ఎత్తాడు. తనకు పరిచయమున్న దామరకొండ సంతోష్​ కుమార్​ అనే ల్యాబ్ టెక్నీషియన్​తో కలిసి వరంగల్ లోని చింతల్​దగ్గర 'హెల్త్​ కేర్​ఫార్మసీ' పేరుతో  2018లో హాస్పిటల్​ ఓపెన్​చేశాడు.  

పెద్ద రోగం పేరు చెప్పి రెఫర్​ 

ముజతాబ అహ్మద్​ పేషెంట్లకు తెలిసిన వైద్యం చేసేవాడు. అవసరం లేకున్నా తన ల్యాబ్​లోనే టెస్టులు చేసి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజేవాడు. కొంతమందికి పెద్ద రోగాలొచ్చాయని చెప్పి ఇతర హాస్పిటల్స్​కు రెఫర్ ​చేసేవాడు. దీనికి గాను పెద్ద మొత్తంలో కమీషన్​ముట్టేది. ఇలా నాలుగేండ్లలో 43 వేల మందికి ట్రీట్​మెంట్ చేశాడు. సమాచారం రావడంతో వరంగల్​టాస్క్​ఫోర్స్​ సీఐలు నరేశ్​కుమార్​, వేంకటేశ్వర్లు హాస్పిటల్​ లో తనిఖీలు చేసి  ముజతాబ అహ్మద్​ ను నకిలీ డాక్టర్​గా తేల్చారు.  ఇతడితో పాటు ల్యాబ్​ టెక్నీషియన్​ సంతోష్​ కుమార్​ ను అరెస్ట్​ చేసి మిల్స్​కాలనీ పీఎస్​కు తరలించారు. సీఐలతో పాటు ఎస్సైలు లవణ్​ కుమార్​, అనిల్​, హెడ్​ కానిస్టేబుల్స్​ శ్యాంసుందర్​, సోమలింగం, అశోక్, మాధవరెడ్డి, స్వర్ణలత, శ్రవణ్ కుమార్, సృజన్, రాజేశ్, నవీన్, అలీ, శ్రీను, నాగరాజు, సురేశ్, రాజు, భిక్షపతి, శ్యామ్, శ్రీధర్​లను సీపీ డా.తరుణ్​ జోషి అభినందించారు.