
- 44 మందికి ట్రీట్మెంట్ ఇస్తున్నం
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ కూకట్పల్లి కల్తీ కల్లు బాధితులు ఆరోగ్యంగానే ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. మొత్తం 44 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న బాధితులను మంత్రి పరామర్శించారు. వారి ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్ డైరెక్టర్ బీరప్పను ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మొత్తం 44 మంది కల్లు బాధితులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
వీరిలో 31 మంది నిమ్స్లో ఉన్నారు. అందరి హెల్త్ కండీషన్ బాగున్నది. నలుగురికి డయాలసిస్ చేస్తున్నారు. నాలుగైదు రోజుల్లో అందరూ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఘటనపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ చేయిస్తున్నది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కల్లు కాంపౌండ్లలో ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు’’అని దామోదర రాజనర్సింహ తెలిపారు.
ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యమే కారణం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
కల్తీ కల్లు ఘటనకు ఎక్సైజ్‌శాఖ నిర్లక్ష్యమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆరోపించారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారికంగా చనిపోతున్న వాళ్లే కాకుండా అనధికారికంగా ఇప్పటి దాకా ఆరుగురు చనిపోయారని మాకు సమాచారం ఉంది. కల్లులో సైకో ట్రాఫిక్ సబ్ స్టన్స్ కలిపినట్టు స్పష్టంగా తెలుస్తున్నది. ఒకట్రెండు సీసాల కల్లు తాగినవాళ్ల కిడ్నీలు కూడా దెబ్బతిన్నాయి. దీన్ని బట్టి కల్తీ ఏ మేరకు జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు’’అని రాంచందర్ రావు అన్నారు.
సీరియస్ యాక్షన్ తీసుకోవాలి: జాన్ వెస్లీ
కల్తీ కల్లు తాగి ఏడుగురు చనిపోవడానికి కారణం ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. కల్తీ కల్లు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వెయ్యి మంది వరకు బాధితులు ఉన్నారని తెలిపారు.