
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ ఆదేశాలను ఉల్లంఘించి రోడ్ల మీదికి వచ్చిన వాహనాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. వీలైనంత మందిని తిరిగి ఇండ్లకు పంపేశారు. అయినా మాట వినకుండా పోలీసులతో వాదనకు దిగినవారి వాహనాలను సీజ్ చేసి, కేసులు పెట్టారు. జీవో 45, 46లను ఉల్లంఘిస్తూ తిరిగినందుకు 188 ఐపీసీ కింద రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. అందులో ఒక్క హైదరాబాద్లోనే మూడు వేల వరకు, జిల్లాల్లో మరో 15 వందల వెహికల్స్ను సీజ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో 73 చోట్ల చెక్పాయింట్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్లో బైకులు 1,058, ఆటోలు 948, కార్లు 429, ఇతర వాహనాలు 45 కలిపి మొత్తం 2,480 వెహికల్స్ను సీజ్ చేశారు. సైబరాబాద్ లో 244, రాచకొండ కమిషనరేట్పరిధిలో 159 వెహికిల్స్ ను సీజ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ వాహనాలను లాక్ డౌన్ పూర్తయిన తర్వాత రిలీజ్ చేస్తామని తెలిపారు.